ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లలో దేని సామర్థ్యం ఎంత?

Update: 2021-03-04 05:30 GMT
వణుకు పుట్టించిన కొవిడ్.. ఇప్పటికి తన ప్రయాణాన్ని కొనసాగిస్తునే ఉంది. దాని పీచమణిచే శక్తి ఉన్న టీకాలు వాడకంలోకి వచ్చినా.. ఈ వైరస్ మాత్రం పూర్తిగా పోని పరిస్థితి. గతంతో పోలిస్తే.. కోవిడ్ అన్నంతనే పుట్టే వణుకు తగ్గినా.. పూర్తిగా మాత్రంపోని పరిస్థితి. ఇదిలా ఉంటే.. కరోనాకు చెక్ పెట్టే టీకాలు మార్కెట్లోకి ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్నాయి. మరి.. దేని సామర్థ్యం ఎంత? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మన దేశం విషయానికి వస్తే.. రెండు వ్యాక్సిన్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. అందులో ఒకటి కోవిషీల్డ్ కాగా..రెండోది కోవాగ్జిన్. సీరం సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ కు పూర్తిస్థాయి అనుమతులు రాగా.. దాని వెనుకనే కొవాగ్జిన్ టీకా వచ్చింది. అయితే.. మూడో దశ ట్రయల్స్ పూర్తి కాక ముందే మార్కెట్ లోకి వచ్చిందన్న విమర్శతో పాటు.. దాని పని తీరు మీద పలువురు సందేహాల్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఇలాంటివేళలోనే.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా దేశీయంగా తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోవటంతో అందరి చూపు దాని మీద పడింది.

తాజాగా ఈ సంస్థ తన మూడో దశ ట్రయల్స్ కు సంబంధించిన మధ్యంతర నివేదికను విడుదల చేసింది. తమ వ్యాక్సిన్ సామర్థ్యం 81 శాతంగా పేర్కొనటంతో పాటు.. యూకే స్ట్రెయిన్ ను నిలువరించే సత్తా తమ టీకాకు ఉన్నట్లు చెప్పారు. దీంతో.. మిగిలిన వ్యాక్సిన్ల సామర్థ్యం మాటేమిటి? దానితో పోలిస్తే.. మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సామర్థ్యాల మాటేమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది.  

సంస్థల వారీగా వెల్లడించిన సామర్థ్యాల్ని చూస్తే..  కొవాగ్జిన్ సామర్థ్యం 81 శాతమన్న సంగతి తెలిసిందే. ఇక..  ఫైజర్ తన వ్యాక్సిన్ సామర్థ్యం 95 శాతమని ప్రకటిస్తే.. మోడెర్నా 95 శాతం వచ్చినట్లు పేర్కొంది. కాకుంటే..కోవిషీల్డ్ విషయంలో కాస్త భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ట్రయల్స్ చేసిన ఒక దాంట్లో 90 శాతం వస్తే.. మరొకదాంట్లో 62 శాతం వచ్చింది. దీంతో.. సగటున దాని సామర్థ్యం 70 శాతంగా తేల్చారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా సామర్థ్యం 66 శాతం కాగా.. నోవావాక్స్ టీకా సామర్థ్యం 89.3 శాతం. ఇలా చూసినప్పుడు కొవాగ్జిన్ వ్యాక్సిన్ సామర్థ్యం ఏ మాత్రం తక్కువ కాదని స్పష్టం చేస్తున్నారు.
Tags:    

Similar News