జితిన్ వల్ల బీజేపీకి లాభమేనా ?

Update: 2021-06-11 03:58 GMT
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ ఘటనకు మీడియా బాగా ప్రాధాన్యత ఇచ్చింది. వచ్చేఏడాదే ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఎన్నికలకు ముందు జితిన్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరటంతో పెద్ద ఇష్యూ అయిపోయింది. అయితే నిజంగానే జితిన్ పార్టీకి రాజీనామా చేయటం వల్ల కాంగ్రెస్ కు అంత డ్యామేజి జరిగిపోతుందా ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జితిన్ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. దక్షిణ ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ కావచ్చు. కానీ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారానికి దూరమై దశాబ్దాలు అయిపోయింది. యూపిలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ-ఎస్పీ-బీఎస్పీ మధ్యే పోటీ కానీ కాంగ్రెస్ పార్టీ సోదిలో కూడా లేదు. ఒంటిరిగా పోటీచేస్తే కాంగ్రెస్ కు మహాఅయితే ఓ పదిసీట్లు వస్తే అదే చాలా ఎక్కువన్నట్లుగా ఉంది పరిస్ధితి.

క్షేత్రస్ధాయిలో తన పరిస్ధితి ఏమిటో తెలుసు కాబట్టే కాంగ్రెస్ కూడా తమిళనాడు తరహాలో ఎస్పీ కానీ లేదా బీఎస్పీతో కానీ ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోందే పోటీచేసేంత సీన్ లేదు. ప్రస్తుత పరిస్ధితిలో రెండు పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకునే అవకాశం తక్కువనే చెప్పాలి. రాష్ట్రం మొత్తంమీద కాంగ్రెస్ పరిస్ధితిని భేరీజు వేసుకున్నాకే జితిన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాబట్టి జితిన్ కాంగ్రెస్ లో ఉన్నా ఒకటే రాజీనామా చేసినా ఒకటే.

ఇక బీజేపీ సంగతి చూస్తే జితిన్ వల్ల కమలంపార్టీకి కూడా పెద్దగా లాభం ఉంటుందని అనుకునేందుకు లేదు. జనాల్లో ఇప్పటికే యోగి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. మోడి పాలన+యోగి పాలనపై వ్యతిరేకత పెరిగిపోయే మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. దీని ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ పడుతుందో ? ఎక్కడ ఓడిపోతామో ? అన్న టెన్షన్ తో అగ్రనేతలు నానా అవస్తలు పడుతున్నారు.

ఈ పరిస్ధితిల్లో జితిన్ చేరిక వల్ల బీజేపీకి కూడా పెద్దగా ఉపయోగం ఉంటుందని అనుకునేందుకు లేదు. ఏదో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత బీజేపీలో చేరారని చెప్పుకునేందుకు మాత్రం పనికొస్తుంది. అదికూడా ఎందుకంటే యూపీలో బ్రాహ్మణ నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదనే గోల ఎక్కువైపోయింది. కాబట్టే జితిన్ తో మాట్లాడుకుని పార్టీలోకి లాక్కున్నారు. జితిన్ సామర్ధ్యంపై కాంగ్రెస్ నేతలకున్న క్లారిటి బీజేపీ నేతలకు కూడా అర్ధమవ్వాలంటే వచ్చే ఎన్నికలవరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News