విజయవాడ అభ్యర్థులపై కోట్లలో బెట్టింగులు

Update: 2019-04-03 01:30 GMT
బెట్టింగ్‌.. ఈ పదం ఒకప్పుడు కేవలం క్రికెట్‌ ఆటలోనూ.. ఇతర గేమ్‌ ల్లోనూ మాత్రమే వింటూ ఉండేవాళ్లం. కానీ బెట్టింగ్‌ సంస్కృతి ఇప్పుడు రాజకీయాలకు కూడా పాకింది. సాధారణంగానే ఎన్నికలు అనగానే అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉండడంతో పాటు ఎవరికి వారే తమ గెలుపుపై తీవ్రంగా కృషి చేస్తారు. ఏపీలో ఇప్పుడు ఎన్నికలు అధికార టీడీపీకి, ప్రతిపక్ష వైసీపీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ తరుణంలో టఫ్‌ ఫైట్‌ గా ఉన్న నియోజకవర్గాలపై కొందరు బెట్టింగ్‌ లు నిర్వహిస్తున్నారు. వేలు, లక్షలు కాదు కోట్ల రూపాయల్లోనే ఈ బెట్టింగ్‌ లు కొనసాగడం విశేషం.

దేశవ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ పోరు కూడా రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఎండాకాలం వేడితో పాటు రాజకీయ వేడి సంతరించుకుంది. గ్రామాల నుంచి పట్టణ స్తానాల్లో  రాజకీయ నాయకుల ప్రచార హోరుతో సందడిగా మారింది. బహిరంగంగా ఇది కనిపించినా చాటు మాటుగా మాత్రం కొన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులపై కోట్లలో బెట్టింగ్‌ కాస్తున్నారు. ముఖ్యంగా టీడీపీలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఈ బెట్టింగ్‌ సాగుతుండడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు వేదికగా ఉన్న విజయవాడ జిల్లాలో సార్వత్రిక పోరు సందడిగా మారుతోంది. అదే సమయంలో ఇక్కడ గట్టిపోటీ నెలకొంది. జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్‌ స్థానాలున్నాయి. వీటిల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర మంత్రులు పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మంత్రి కొల్లూరు రవీంద్ర టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఈసారి ఆయనను ఎలాగైనా ఓడించాలని వైసీపీ బలమైన అభ్యర్థి పేర్ని నాని పోటీగా నిలబెట్టింది. జనసేన నుంచి బండి రామకృష్ణ కూడా బరిలో ఉన్నారు. ముగ్గురూ బలమైన అభ్యర్థులే కావడంతో నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వారు మచిలీపట్నం వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో ఎవరు గెలుస్తారోనని లక్షల్లో పందాలు కాస్తున్నారు.

ఇక మైలవరం పేరు చెప్పగానే మంత్రి దేవినేని ఉమ గుర్తుకు వస్తారు. వచ్చే ఎన్నికల్లో ఆ పేరు వినకూడదనే ఆలోచనతో వైసీపీ ఆర్థికంగా, సామాజిక బలమైన నేత అయినా వసంతకృష్ణప్రసాద్‌ ను బరిలోకి దింపింది. రాజకీయ అనుభవంతో పాటు అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని ఉమా మహేశ్వర్‌ రావు ప్రచారం చేస్తుండగా.. ఈసారి ఎలాగైనా ఉమను ఓడించి తీరుతామని కృష్ణప్రసాద్‌ శపథం చేస్తున్నారు.

ఇక తిరువూరు నియోజకవర్గంలో మంత్రి కేఎస్‌ జవహర్‌ ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. ఆయనకు ధీటుగా వైసీపీ నుంచి కొక్కిలి గడ్డ రక్షణ నిధి బరిలో ఉన్నారు. ఇరువురు పోటాపోటీగా ప్రచారంలోకి దూసుకుపోతుండడంతో ఈ స్థానాలపై కూడా బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది.

మరోవైపు విజయవాడలో అత్యంత కీలక నియోజకవర్గం గుడివాడలో పోరు భీకరంగానే ఉంది. వరుసగా గెలుస్తున్న కొడాలి నానిపై తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి తనయుడు దేవినేని అవినాస్‌ ఢీకొడుతున్నాడు. ఒకరు రాజకీయ సీనియర్‌ నేతగా మరొకరు తెలుగు యువత నాయకుడి ప్రచార వేడిని పెంచుతున్నారు. విజయవాడ సెంట్రల్‌ లో టీడీపీ తరుపున బొండా ఉమామహేశ్వర్‌ రావు, వైసీపీ తరుపున మాజీ మంత్రి మల్లాది విష్ణు, విజయవాడ పశ్చిమంలో టీడీపీ నుంచి ఎన్‌ ఆర్‌ ఐ షబానా, వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్‌ లు పోటీ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు రకరకాల ఆరోపణలు చేసుకుంటూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. అంతేస్థాయిలో ఈ ఉద్దండులపై బెట్టింగ్‌ రాయులు కోట్ల రూపాల్లో పందేలు కాస్తున్నారు. అభ్యర్థుల మధ్య ధీటైన పోటీ ఉండడంతో రాష్ట్రంలో విజయవాడపై అందరి దృష్టి పడింది. ఆ కోవలోనే ఇక్కడి అభ్యర్థులు, నియోజకవర్గాల్లో గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్ లు కాస్తుండడం గమనార్హం.

    
    
    

Tags:    

Similar News