ఆ ముగ్గురిలో టీపీసీసీ పీఠం ఎవరిదో ?

Update: 2020-01-18 06:44 GMT
తెలంగాణ కాంగ్రెస్ లో మున్సిపల్ ఎన్నికల హిట్ కంటే కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. గత కొద్దిరోజులుగా దీనిపై విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలుసార్లు ఈ పీసీసీ చీఫ్  ఎంపిక వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ పదవికి త్వరలోనే రాజీనామా చేయబోతున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు ..ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల అనంతరం కొత్త పీసీసీ చీఫ్ పై అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోబోతుంది అని తెలుస్తుంది. దీనికోసం  పలువురు నాయకులను పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుల పేర్లే జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి.

అసలు ఈ పదవి రేసులో ఎవరెవరు ఉన్నారంటే ... టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ -మల్కాజ్‌ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి - మాజీ మంత్రి చిన్నారెడ్డి - మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్లు టీపీసీసీ చీఫ్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి - ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌‌ ల పేర్లను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. వీళ్లలో అధిష్టానం ఎవరికి పదవిని కట్టబెట్టబోతుందన్నది పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నవాళ్లలో రేవంత్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. కాంగ్రెస్‌ లో చేరినప్పటి నుంచి.. టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టడమే టార్గెట్‌ గా ఆయన పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే తన లక్ష్యం అని పలుమార్లు స్వయంగా వెల్లడించిన రేవంత్.. అందుకోసం టీపీసీసీ చీఫ్ పదవిని షార్ట్ కట్‌ గా భావిస్తున్నారు. నిజానికి డిసెంబర్ - 2018లో జరిగిన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్‌ కి కట్టబెట్టాలని అధిష్టానం భావించినప్పటికీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా ఆయనకి టీపీసీసీ చీఫ్ పదవి రాకుండా అడ్డుకునేవారు చాలామంది ఉన్నారు. అలాగే రేవంత్ కి మద్దతుగా నిలిచే వారు కూడా ఉన్నారు.

ఇక రేవంత్ రెడ్డి తరువాత - పీసీసీ రేసులో ముందువరుసలో ఉండేది .. సీనియారిటీ - పార్టీ పట్ల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుంటే చిన్నారెడ్డి. ఒకవేళ పార్టీకి జనాకర్షణ కలిగిన నాయకుడే కావాలనుకుంటే రేవంత్ వైపు అధిష్టానం మొగ్గుచూపవచ్చు. అయితే రేవంత్ ఎంపికకు సీనియర్లు అడ్డుపడే అవకాశం ఉండటంతో.. అధిష్టానం ఏం నిర్ణయిస్తుందనేది సస్పెన్స్‌ గా మారింది. ఇక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు కూడా రేసులో గట్టిగానే వినిపిస్తోంది. పార్టీకి విధేయుడు - సైలెంట్‌ గా పనిచేసుకుపోతాడన్న పేరు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశంగా మారింది. సీనియర్ నేతలతో శ్రీధర్ బాబుకు సఖ్యత ఉండటం కూడా మరింతగా ఆయనకి కలిసొచ్చే అంశం. ఇక ఈ నెల 22న రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కూడా టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నవాళ్లకు ఒక పెద్ద సవాల్‌ గా మారాయి. కాంగ్రెస్‌ కు ఎవరైతే ఎక్కువ స్థానాలను కట్టబెడుతారో. టీపీసీసీ పదవి కోసం వాళ్లు గట్టిగా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నేతలు తమవంతు ప్రయత్నాలుచేస్తున్నారు. ఏదేమైనా కొద్దిరోజుల్లోనే టీపీసీసీ చీఫ్ పదవిపై అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News