ఈ ప్ర‌భుత్వ బ‌డికి మామూలు డిమాండ్ లేదుగా.. అప్పుడే నో వేకెన్సీ బోర్డు!

Update: 2022-06-24 13:30 GMT
సాధార‌ణంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లంటే త‌ల్లిదండ్రులు, పిల్ల‌ల‌కు చిన్నచూపు ఉంటుంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో స‌రైన వ‌స‌తులు ఉండ‌వ‌ని, బాగా పాఠాలు చెప్ప‌ర‌నే సందేహం ఉంటుంది. అదే ప్రైవేటు పాఠ‌శాల అయితే బాగా చెబుతార‌ని.. త‌మ పిల్ల‌ల‌ను వాటిలో చేర్పిస్తుంటారు. డ‌బ్బు ఉన్న‌వారిదీ, లేనివారిదీ ఇదే దారి అంటే అతిశ‌యోక్తి కాదు.

అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు త‌ల్లిదండ్రులు వేలంవెర్రిగా విర‌గ‌బ‌డ్డారు. త‌మ పిల్ల‌ల‌కు అడ్మిష‌న్లు కావాలంటూ జాత‌ర‌కు వ‌చ్చిన‌ట్టు వ‌చ్చారు. దీంతో అడ్మిష‌న్లు పూర్త‌యిపోవ‌డంతో చాలామంది త‌ల్లిదండ్రులు నిరాశ‌గా వెనుదిరిగారు. ఇప్ప‌టికే 1200 మందికి పైగా విద్యార్థులు చేర‌డంతో ఆ పాఠ‌శాల బ‌య‌ట నో వేకేన్సీ.. నో అడ్మిష‌న్స్ అంటూ బోర్డు పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా ఇందిరానగర్‌లో ఉన్న ప్ర‌భుత్వ జెడ్పీ హైస్కూల్‌లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంది. ఈ స్కూల్‌లో దాదాపు 1,200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మొత్తం 24 సెక్షన్లు ఉన్నాయి. 14 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు, 40 మంది ఒప్పంద‌ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పాఠ‌శాల‌కు ఏటా విద్యార్థులు పోటెత్తుతున్నారు. దీంతో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. పాఠ‌శాల‌లో విద్యా ప్ర‌మాణాలు బాగుండ‌టం, స‌క‌ల వ‌స‌తులు ఉండటంతో త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ఇందిరాన‌గ‌ర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేర్పిస్తున్నారు.

తెలంగాణ‌లో పాఠ‌శాల‌లు తెరిచి ఇంకా 20 రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే ఇందిరాన‌గ‌ర్ లో 7, 8, 9, 10 త‌ర‌గ‌తుల్లో అడ్మిష‌న్లు పూర్తి అయిపోయాయి. ఇంకా అడ్మిష‌న్ల కోసం త‌ల్లిదండ్రులు వ‌స్తుంటే ఈ త‌ర‌గ‌తుల్లో అడ్మిష‌న్లు లేవ‌ని స్కూల్ బ‌య‌ట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒక్క ఆరో త‌ర‌గ‌తిలో మాత్ర‌మే 160 సీట్లు ఖాళీలు ఉన్నాయ‌ని ప్ర‌ధానోపాధ్యాయుడు రామ‌స్వామి చెబుతున్నారు.

ఈ 160 సీట్ల‌కు భారీ సంఖ్య‌లో త‌ల్లిదండ్రులు, విద్యార్థులు వ‌చ్చారు. దీంతో ఆయ‌న వారితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ 160 సీట్ల‌ను క్లస్టర్ పరిధిలోని 12 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు తొలి ప్రాధాన్యం కింద కేటాయిస్తామ‌న్నారు. మిగిలిన సీట్లను మొద‌ట వ‌చ్చిన‌వారికి మొద‌ట ప్రాధాన్యం కింద‌ ఇతరులతో భర్తీ చేస్తామన్నారు.

స్కూల్‌లో సీట్లు ఖాళీ లేవ‌ని ఉపాధ్యాయులు చెబుతుండ‌టంతో త‌ల్లిదండ్రులు రాజకీయ నేత‌ల నుంచి రిక‌మండేష‌న్ లెట‌ర్లు తెచ్చుకుంటున్నారు. అలాగైనా త‌మ పిల్ల‌ల‌కు సీటు ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నారు. అయితే రిక‌మండేష‌న్ లెట‌ర్ తెచ్చినా సీట్లు ఖాళీ లేవ‌ని అడ్మిష‌న్లు ఎలా ఇస్తామ‌ని స్కూల్ సిబ్బంది చెబుతుండ‌టం కొస‌మెరుపు.
Tags:    

Similar News