కంచుకోట‌లో టీడీపీకి వారే పెద్ద దెబ్బ... ఇన్ని షాకులా ?

Update: 2021-06-22 03:11 GMT
తెలుగుదేశం పార్టీకి ఎన్ని కంచుకోట‌లు ఉన్నా కూడా... కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండు పెట్ట‌ని కోట‌లు. ఈ రెండు జిల్లాలు పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కొమ్ము కాస్తూ వ‌స్తున్నాయి. పార్టీ ఓడిపోయిన 2009 ఎన్నిక‌ల్లో కూడా కృష్ణా జిల్లాలో కాంగ్రెస్‌, ప్ర‌జారాజ్యం కంటే టీడీపీకే ఎక్కువ సీట్లు వ‌చ్చాయి. గుంటూరులోనూ కంచుకోట‌ల్లాంటి ఆరు నియోజ‌క‌వ‌ర్గాల‌ను టీడీపీ నిలుపుకుంది. అలాంటి కంచుకోట‌లు గ‌త ఎన్నిక‌ల్లో కుప్ప‌కూలిపోయాయి. కృష్ణాలో రెండు, గుంటూరులో రెండు సీట్ల‌లో మాత్ర‌మే టీడీపీ గెలిచింది. విచిత్రం ఏంటంటే ఈ రెండు జిల్లాల్లో టీడీపీ నుంచి గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేల్లో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి ఇద్ద‌రూ ఫ్యాన్ కింద సేద తీరుతున్నారు.

ఇక గుంటూరు జిల్లా టీడీపీ అంటేనే కమ్మ నేత‌ల హ‌వా ఎలా ఉంటుందో ?  చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ప్ర‌భుత్వంలో టీడీపీ నుంచి ఏకంగా ఏడుగురు క‌మ్మ ఎమ్మెల్యేలు ఉండ‌గా, గుంటూరు, న‌ర‌సారావుపేట రెండు స్థానాల నుంచి కూడా క‌మ్మ నేత‌లే ఎంపీలు అయ్యారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఈ 9గురు నేత‌ల‌కు తోడుగా మంగ‌ళ‌గిరి నుంచి నారా లోకేష్.. మొత్తం 10 మంది క‌మ్మ నేత‌లు పోటీ చేశారు. వీరంతా రాజ‌కీయంగా త‌ల‌పండిన వాళ్లే... వీళ్లంతా క‌ట్ట‌క‌ట్టుకుని ఓడిపోయారు. మంగ‌ళ‌గిరిలో మంత్రిగా ఉండి, చంద్ర‌బాబు త‌న‌యుడు హోదాలో పోటీ చేసిన నారా లోకేష్ సైతం చిత్త‌య్యారు.

పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు హంగామా చేసిన క‌మ్మ నేత‌లు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అప్పుడు మంత్రిగా ఉన్న పుల్లారావు కేసుల‌కే భ‌య‌ప‌డి సైలెంట్ అయ్యారంటున్నారు. య‌ర‌ప‌తినేని, జీవీ మ‌రీ సైలెంట్ అయిపోయారు. రాయ‌పాటి వ‌యోః భారంతో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. కోడెల ఆక‌స్మిక మ‌ర‌ణం పార్టీకి పెద్ద లోటే..! మాచ‌ర్ల‌, బాప‌ట్ల‌, గుంటూరు తూర్పు, న‌ర‌సారావుపేట లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. 1999 త‌ర్వాత ఇక్క‌డ పార్టీకి గెలుపు అన్న మాటే మ‌ర్చిపోయింది. టీడీపీలో క‌మ్మ నేత‌లు అన్ని ప‌ద‌వులు మాకే కావాల‌న్న ప‌ట్టుద‌ల‌కు పోవ‌డంతో మిగిలిన వ‌ర్గాలు పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడూ దూర‌మ‌య్యాయి. ఇప్పుడు వీరు ఓడిపోయి ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో వీరిని ప‌ట్టించుకునేందుకు పార్టీలోనే మిగిలిన వ‌ర్గాల నేత‌లు రావ‌డం లేదు.
Tags:    

Similar News