ఈ హగ్గులో పోటీలో గెలుపెవరిది రాహుల్..?

Update: 2018-07-21 07:42 GMT

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కపోయాక.. టీడీపీ నేతలంతా కేసీఆర్ పై  ఆడిపోసుకున్నారు.  ఒకానొక దశలో చంద్రబాబు-కేసీఆర్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వాతావరణం తయారైంది. కానీ  ఏడాదికే తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని మీడియా సాక్షిగా హగ్ చేసుకున్నారు. అమరావతి శంకుస్థాపనలో అయితే ప్రశంసలు కురిపించుకున్నారు.  ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.. ఓటుకు నోటు కేసు అటకెక్కింది. రాజకీయాల్లో శాశ్వత శతృత్వం.. శాశ్వత మితృత్వం ఉండదనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరోటి ఉండదు.. దేశాన్ని షేక్ చేసిన ఓటుకు నోటు కేసు కనుమరుగైపోవడానికి  కేసీఆర్ కు చంద్రబాబు ఇచ్చిన ఒక్క హగ్గే కారణం.. దానివెనుక ఏం డీల్ ఉందనేది మనకు తెలియదు కానీ.. పాత పగలు మరిచిపోయేలా చేసింది మాత్రం ఆ హగ్గే..

ఆలింగనానికి ఉన్న పవరే అలాంటింది. మొన్నటివరకూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న వాళ్లు కూడా ఈరోజు చట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు. అవసరానికి తగ్గట్టుగా రాజకీయ నాయకులు మారిపోతుంటారు.. ప్రవర్తిస్తుంటారు.  హగ్గుల ద్వారానే ముగ్గులోకి దించుతుంటారు. మనుషులు భౌతికంగా దగ్గరైనట్టు కనపించినా వారి రాజకీయ అవసరాల మేరకే ఈ కౌగిలింతలు ఉంటాయి. మనసుల్లో మాత్రం ఎప్పటికీ వారి మధ్య ప్రేమ ఉండదు..

తాజాగా రాహుల్ గాంధీ కొత్తగా ట్రెండ్ సృష్టించాడు. ప్రధాని నరేంద్రమోడీపై ఎన్నో పరుష విమర్శలకు దిగి అనంతరం సడన్ గా పార్లమెంట్ లోని ప్రధాని మోడీ కుర్చీ వద్దకు వెళ్లి కౌగిలించుకున్నారు. ఇప్పుడిది టాక్ ఆఫ్ ది న్యూస్ అయ్యింది.  మోడీని కౌగిలించుకున్న రాహుల్ గాంధీ వైఖరి చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో వైరమే కానీ.. వ్యక్తులుగా కాదు అని చాటిచెప్పే ప్రయత్నం చేశారా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే హగ్ చేసుకొని తన సీట్లో కూర్చున్న రాహుల్ గాంధీ.. ఆ తర్వాత తన ఎంపీలను చూసి కన్నుకొట్టారు.   మోడీతో హగ్ ఉత్తుత్తిదే అని చాటిచెప్పేలా ప్రయత్నం చేశాడు.  నెటిజన్లు మాత్రం ఈ హగ్గులపై సెటైర్లు వేస్తున్నారు. ప్రియా వారియర్ కన్నుకొట్టిన వీడియోను రాహుల్ గాంధీ కి జతచేసి కామెడీ స్ఫూఫ్ లు చేస్తున్నారు.  ఇలా ఒక్క హగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. రాహుల్ గాంధీ ఏ ఉద్దేశంతో చేశాడో కానీ దానిపై ఎవరికి వారు తమకు తోచిన విధంగా   అర్థం చేసుకొని కామెంట్స్ చేస్తున్నారు.

ఎవరు ఏమన్నా కానీ ఒక్క హగ్ ఎంత శత్రువునైనా మిత్రుడిగా మారుస్తుంది.. శంకర్ దాదా సినిమాలో చూపినట్టు మానవత్వాన్ని చాటుతుంది. మరి బయట కత్తలు దూసుకునే రాహుల్-మోడీలు ఈ తాజా హగ్ తోనైనా తమ విమర్శల వేడిని తగ్గిస్తారో లేదా యథాలాపంగా కొనసాగిస్తారా అన్నది వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News