నమ్మలేనంత దారుణం.. మానవ శరీర భాగాల్ని కొని ఫేస్ బుక్ లో సేల్

Update: 2022-08-20 04:30 GMT
కొన్ని దారుణాలు విన్నంతనే గగుర్పాటుకు గురవుతుంటారు. నమ్మలేనంతగా ఉండే ఇలాంటి దారుణాలు నిజంగానే జరిగాయా? అన్నట్లుగా అనిపిస్తాయి. మానవత్వం అన్నది లేకుండా.. అసలు అలాంటోళ్లు మనుషులేనా? అన్న భావన కలిగేలా చేసే ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. మానవ శరీర భాగాల్ని కొనుగోలు చేసి.. వాటిని సోషల్ మీడియా మాథ్యమైన ఫేస్ బుక్ లో అమ్మే ఒక దుర్మార్గుడ్ని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.

అగ్రరాజ్యంలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఎనోలాకు చెందిన 40 ఏళ్ల పాలీ మానవ శరీర భాగాల్ని అమ్మే ప్రయత్నం చేసినట్లుగా గుర్తించారు.

ఇంతకీ అతగాడికి మానవ శరీర భాగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్న విషయంలోకి వెళితే.. లిటిల్ రాక్ లోని యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సాస్ ఫర్ మెడికల్ సైన్సెస్ కు చెందిన మార్చురీలో పని చేసే మహిళా సిబ్బంది నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించారు.

అంతేకాదు.. తాను చేసే ఈ ఎదవ పనికి సంబంధించి యాడ్ లను పోస్టు చేసి.. అమ్మే ప్రయత్నం చేశారు.సేల్ కు ఉంచిన మానవ శరీర భాగాలకు చెందిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

ఈ గగుర్పాటుకు చెందిన పేజీ వివరాల్ని ఇవ్వట్లేదు. అంతేకాదు.. ఇతగాడికి చెందిన వెబ్ సైట్ లో అతగాడు అమ్మకానికి పెట్టిన విషయాలు షాకింగ్ గా ఉన్నట్లు చెబుతన్నారు. అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇతగాడి గురించి తెలిసిన వెంటనే ఎఫ్ బీఐ కూడా రంగంలోకి దిగింది. ఇతడు అమ్మకానికి పెట్టిన మానవ శరీర భాగాల్లో కొన్నింటిని అమెరికాలో చట్టబద్ధంగా అమ్మే వీలు ఉందని.. కొన్నింటిని మాత్రం అక్రమంగా అమ్మే ప్రయత్నం చేసినట్లుగా గుర్తించారు. ఈ ఉదంతం విన్నంతనే ఉలిక్కిపడేలా చేయటంతో పాటు.. కంపరంతో ఒళ్లంతా గగుర్పాటుకు గురయ్యేలా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News