జగన్ ని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ లేస్తుందా ?

ఏపీలో రాజకీయం బీజేపీ పెద్దలకు అంతు పట్టకుండా ఉందా అంటే అవును అన్న రాజకీయ విశ్లేషణలే వినిపిస్తున్నాయి.;

Update: 2025-03-27 15:07 GMT
జగన్ ని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ లేస్తుందా ?

ఏపీలో రాజకీయం బీజేపీ పెద్దలకు అంతు పట్టకుండా ఉందా అంటే అవును అన్న రాజకీయ విశ్లేషణలే వినిపిస్తున్నాయి. ఏపీలో హిందూత్వ పాలిటిక్స్ చెల్లవు. అదే కనుక జరిగి ఉంటే ఈపాటికి బీజేపీ అధికారంలోకి వచ్చేసి ఉండేది. తిరుమల లడ్డూ కల్తీ అని గత ఏడాది అతి పెద్ద ఆధ్యాత్మిక వివాదం నడచినా జనాలు సహనం పాటించారు.

ఉమ్మడి మద్రాస్ స్టేట్స్ లో భాగంగా చాలా దశాబ్దాలు ఏపీ ఉంది. దాంతో ద్రవిడ వాదం మూలాలు ఏపీలోనూ ఉన్నాయి. అంతే కాదు హేతు వాదం ఉంది. వామపక్ష భావజాల ప్రభావం కూడా ఉంది. అందువల్లనే ఏపీలో పూర్వకాలంలో అనేక పార్టీలు స్వతంత్రంగా పుట్టుకుని వచ్చి నాయకులు చట్ట సభలలోకి వచ్చారు. ఇక ఆస్తికత్వం ఉంది కానీ మతం వ్యక్తిగతం అన్న సన్నని గీత గురించి ఏపీ జనాలకు తెలుసు అని అంటారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో 2029 నాటికి బలమైన రాజకీయ పార్టీగా అవతరించాలని బీజేపీకి ఉంది. దాతో తనకు మిత్రపక్షం అయిన జనసేన సహకారంతో పాటు అధికార కూటమిలో ఉన్న అడ్వాంటేజిని తీసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇక ఏపీలో కూటమిలోని మూడు పార్టీలకు ఉమ్మడి ప్రత్యర్థిగా వైసీపీ ఉంది.

టీడీపీ జనసేన బీజేపీ ఒకే భావసారూప్యం కలిగిన పార్టీలు. దాంతో ఈ మూడూ కలసి అరవై శాతం ఓటింగ్ పట్టేసాయి. ఆ మిగిలిన నలభై శాతం ఓటింగ్ వైసీపీ వద్ద ఉంది. ఆ ఓటింగ్ పెద్ద ఎత్తున టర్న్ చేసుకుంటే ఏపీలో బలంగా పాతుకుని పోవచ్చు అన్నది బీజేపీకి ఉంది. జనసేనకు కూడా టీడీపీ కంటే వైసీపీని దెబ్బ తీస్తేనే తొందరగా ఆ రాజకీయ ఖాళీలోని తాము వెళ్ళగలమన్న ఆలోచనలు ఉన్నాయి.

ఇక టీడీపీ సంగతి తెలిసిందే వైసీపీ ప్రత్యర్థిగా బలంగా ఉంటే రాజకీయంగా సవాళ్ళే అన్నది ఉంది. పైగా జనాలు తమిళనాడు ఆనవాయితీని అనుసరిస్తే ఎంత బాగా పాలించినా కూడా ఓటమి తప్పదన్న లెక్కలూ ఉన్నాయి. దాంతో మూడు పార్టీలూ మూడు విధాలుగా ఆలోచిస్తూ వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఏపీలో వైసీపీని దెబ్బ తీస్తే ఆ ఓటు బ్యాంక్ ఈ మూడు పార్టీలకు మళ్ళుతుందా అంటే రాజకీయ విశ్లేషణలు చూస్తే అలా జరిగే చాన్స్ లేదని చెబుతున్నాయి.

ఏపీలో కాంగ్రెస్ అత్యంత బలంగా ఉండేది. అడ్డగోలు విభజన కారణంగానే కాంగ్రెస్ చతికిలపడింది. దాంతో ఆ ప్లేస్ లోకి దూసుకుని వచ్చిన వైసీపీ గట్టి పార్టీగా ఎమర్జ్ అయింది. ఈ రోజుకీ వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ దే అని చెప్పాల్సి ఉంది. ఒకవేళ ఏ కారణం చేత అయినా ఏపీలో వైసీపీని టార్గెట్ చేసి జగన్ ని ఇబ్బందుల పాలు చేస్తే అది కాంగ్రెస్ కే వరంగా మారుతుందని అంటున్నారు.

2012లో జగన్ ని జైలులో పెట్టారు. కానీ అపుడు ఉన్న రాజకీయ సన్నివేశాలు వేరు. కాంగ్రెస్ విభజన వల్ల కోలుకోలేకపోయింది. పైగా జగన్ మీద పూర్తి స్థాయిలో మోజు సానుభూతి ఉన్నాయి. వైఎస్సార్ కుటుంబం అంతా ఏకమై జనంలోకి వచ్చి పోరాడింది. దాంతో వెల్లువలా ఎమోషన్స్ పండాయి. ఫలితంగా వైసీపీ స్ట్రాంగ్ అయింది.

ఈసారి జగన్ ని అరెస్ట్ చేస్తే వైసీపీలో ఆయన లేకుండా పార్టీని ఎవరు లీడ్ చేయగలరు అన్నది ఒక చర్చగా ముందుకు వస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ కి ఒక మంచి అవకాశంగా ఏపీ మారవచ్చు అని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. రేవంత్ రెడ్డి వంటి డైనమిక్ లీడర్ సీఎం గా ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడుతోంది. ఆ ప్రభావం ఏపీ మీద పడి ఎన్డీయే వ్యతిరేక శిబిరం బలంగా తయారు కావచ్చు అని అంటున్నారు.

అంటే ఏపీలో జగన్ ని డిస్టర్బ్ చేస్తే బీజేపీకి మేలు జరగకపోగా కాంగ్రెస్ ని కోరి లేపినట్లు అవుతుందని అంటున్నారు. ఏపీలో లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ ఈడీలను రంగంలోకి దించుతారు అన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో జగన్ విషయంలో బీజేపీ పెద్దల ఆలోచనలు ఏమిటి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. మరో వైపు చూస్తే తనకు రాజకీయంగా లాభం లేకపోతే బీజేపీ ఎందుకు పొలిటికల్ గా బిగ్ ఆపరేషన్ కి రెడీ అవుతుంది అన్న సందేహాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అయితే ఏపీలో జరిగే పరిణామాలు జాతీయ స్థాయిలోనూ ప్రతిబింబించవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News