భార్య హ్యాపీగా ఉందని ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

Update: 2019-08-05 06:05 GMT
ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందటమే కాదు.. చట్టంగా మారిన సంగతి తెలిసిందే. ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి సంతకం చేసిన నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ చెప్పటం నేరంగా మారిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ చెప్పటాన్ని నేరంగా పరిగణించటాన్ని పలు రాజకీయ పక్షాలు సమర్థిస్తుంటే.. మరికొన్ని పక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇలాంటి పరిస్థితే ముస్లింవర్గాల్లోనూ ఉందన్న మాట వినిపిస్తోంది.

ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ముస్లిం మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ అభద్రతా భావంలో ఉంటే మహిళలకు తాజా చట్టంతో వారిలో ధీమా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో మాదిరి ఎవరికి వారుగా.. వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ట్రిపుల్ తలాక్ చెప్పే ధోరణి తగ్గే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోద ముద్ర పడిందన్న వార్త.. ఒక కాపురంలో కొత్త కలకలాన్ని రేపింది. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ ఆమోద ముద్ర పడిందన్న సంతోషంతో ఆనందంతో ఉన్న భార్యను చూసిన సదరు భర్తలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఊహించని రీతిలో ట్రిపుల్ తలాక్ చెప్పేసి.. ఏం చేసుకుంటావో చేసుకో అని వ్యవహరించినట్లుగా సమాచారం.

యూపీలో చోటు చేసుకున్న ఈ పరిణామం షాకింగ్ గా మారింది. ట్రిపుల్ తలాక్ చట్టంగా మారటంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన భార్యను చూసిన షంషుద్దీన్ లో ఆగ్రహం కట్టలు తెంచుకోవటమే కాదు.. భార్య ముఫీదా ఖాటూన్ వద్దకు వెళ్లి.. తలాక్.. తలాక్.. తలాక్ అంటూ మూడుసార్లు చెప్పేసిన వైనంతో ఆమె అవాక్కు అయిన పరిస్థితి. తనకు జరిగిన అన్యాయంపై ఆమె స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా చెబుతున్నారు.


    

Tags:    

Similar News