హుజూరాబాద్ ఎఫెక్ట్: కోటీశ్వరులవుతున్న అక్కడి నేతలు

Update: 2021-09-04 05:58 GMT
నిన్న మొన్నటి వరకు వారు పేద  లీడర్లు..అప్పుల  కుప్పలు మీద పడి.. అరువు తెచ్చుకునే కార్లలో తిరిగేవారు.. తమ బతుకులింతే అన్న ధోరణిలో చేతికి దొరికిన పని చేసుకుంటూ కాలం వెళ్లదీసుకునేవారు. కానీ ఇప్పుడు వారంతా లక్షాధికారులయ్యారు.. అదృష్టం ఎక్కువ ఉన్నవాళ్లు రాత్రికి రాత్రే  కోటీశ్వరులవుతున్నారు.. అప్పులన్నీ తీర్చేశారు.. ఇస్త్రీ నలగని డ్రెస్సులు వేసుకుంటున్నారు.. ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు.. వారు ఏది కావాలంటే అది.. కో అంటే కోటి రూపాయలు.. కొంచెం సామర్థ్యం తక్కువగా ఉంటే లక్షల రూపాయలు.. ఇలా ఒక్కసారిగా వారు ఊహించని విధంగా తమ అకౌంట్లలోకి డబ్బు వచ్చిపడుతుంది. అంతేకాకుండా కోరిన కార్లన్నీ ఇంటిముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇంతకీ ఆ అదృష్టవంతులెవరనేది తెలుసుకోవాలని ఉందా..?

కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట నగరాల్లోని కార్ల షోరూంల్లో వాహనాల కొనుగోలుకు వరుసగా బుకింగ్ అవుతున్నాయట.   కేవలం కార్లు మాత్రమే కాదు. డబ్బు కావాలనుకున్న వారికి డబ్బు.. వస్తువులు అవసరమున్న వారికి వస్తులు.. ఇలా  ‘కో అంటే కోటి’ అన్నట్లుగా... వారి అడిగిందే ఆలస్యం అన్నట్లు డబ్బులు పంచుతున్నాయి ప్రధాన పార్టీలు. అయితే ఇదంతా హూజూరాబాద్ వాసులకు మాత్రమే. త్వరలో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్నందున ఇక్కడి నాయకులను వశం చేసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీలు పోటా పోటీగా నజరానాలు కురిపిస్తున్నారు.  

హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉంది. ఇక్కడ ఎవరైనా ప్రజాబలం ఉన్న వ్యక్తికి పంట పండినట్లే. గ్రామ వార్డు మెంబర్ కు లక్షకు పైగా ఇస్తున్నారని లోకల్ గా చర్చ సాగుతోంది. అలాగే సర్పంచ్ కు 3 నుంచి 5 లక్షలు , జిల్లా స్థాయి నాయకులకు రూ. 10 లక్షలు ఇస్తున్నారని టాక్. ఇక కుల సంఘంలో జిల్లా స్థాయి నాయకుడైతే ఏమాత్రం ఆలోచించకుండా 10 లక్షలు ముట్టజెప్పుతున్నారట. ఇక ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి వత్తాసుపలికేవారికి మరీ డిమాండ్ ఉందట. అయితే ఇవన్నీ వారిపై నమ్మకం కుదిరితేనే ఇస్తున్నారని సమాచారం. మరోవైపు వాణిజ్య సంఘాలకూ వరాల జల్లు కురుస్తోంది. ఇన్ని ఓట్లు వేయిస్తామని ఒప్పందం చేసుకుంటే వారిలో ముఖ్య నాయకుడికి కార్ల ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం.

నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అయినా ఇప్పుడే రాజకీయ పోరు రసవత్తరంగా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఇప్పటికే దళిత బంధు ప్రకటించి దళిత వర్గాలను ఆకట్టుకుంటోంది. మిగతా వర్గాలకు వారు అడిగిన నజరానాలను ఇస్తోంది. అయితే ఇప్పుడే ఇన్ని తాయిలాలు ఇస్తే ఉప ఎన్నిక జరిగే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా చోటా మోటా లీడర్లకు మాత్రం బంఫర్ ఆఫర్లు వస్తున్నాయి. సీనియర్ నాయకులకు టీఆర్ఎస్ నామినేటేడ్ పోస్టులతో వల వేస్తుండగా.. కింది స్థాయి లీడర్లకు మాత్రం నగదుతో సత్కరిస్తున్నట్లు సమాచారం. దీంతో మొన్నటి వరకు అనామకంగా ఉన్న వారు ఇప్పుడు కోటీశ్వరులవుతున్నారు.  అయితే కొందరు తమకు ఎక్కువ తాయిలం ఎక్కడ వస్తుందో చూసుకొని ఆ పార్టీలోకి జంప్ కొడుతున్నారు. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నిక చాలా కాస్ట్లీగా మారింది. బై ఎలక్షన్ పుణ్యమాని స్థానికంగా ఉన్నకొందరు అనుకోని విధంగా లాభపడుతున్నారు. తెలంగాణ రాజకీయాలు హుజూరాబాద్ చుట్టూ తిరుగుతుంటూ.. హుజూరాబాద్ ప్రజలు, చోటా మోటా నాయకుల చుట్టూ ప్రధాన పార్టీలు తిరుగుతున్నాయి. అయితే చివరికి ఏ ప్రధాన పార్టీ తమ పెట్టుబడులను లాభంగా పొందుతుందోనని రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News