హైదరాబాద్ లో తొలిసారి..ఫ్లైఓవర్ కు లైన్ మేనేజ్ మెంట్

Update: 2020-01-05 06:59 GMT
హైదరాబాద్ మహానగరంలో అతి ఎత్తున ఉండేదిగా గుర్తింపు తెచ్చుకున్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఎంతటి వివాదాస్పదంగా మారిందో తెలిసిందే. ఈ ఫ్లైఓవర్ ప్రారంభించిన వారం వ్యవధిలోనే ఘోర ప్రమాదాలు చోటు చేసుకోవటంతో.. డిజైన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ డిజైన్ బాగోలేదన్న మాట పలువురి నోట వినిపించినప్పటికీ.. నిపుణులు ఇచ్చిన రిపోర్టును అధికారులు బయట పెట్టకపోవటంతో అందులో ఏముందో అర్థం కాని పరిస్థితి.

ఫ్లైఓవర్ ప్రారంభమైన స్వల్ప వ్యవధిలోనే పలువురి ప్రాణాలు పోయిన నేపథ్యంలో.. ఈ ఫ్లైఓవర్ ను మూసేసి.. మరిన్ని భద్రతా చర్యల్ని చేపట్టారు. శనివారం నుంచి మళ్లీ ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ కు కొన్ని రూల్స్ ను పెట్టారు. హైదరాబాద్ మహానగరంలోని ఏ ఫ్లైఓవర్ మీద లేనన్ని రూల్స్ ను ఇక్కడ అమలు చేయాలని భావిస్తున్నారు. అన్నింటికి మించి లైన్ మేనేజ్ మెంట్ విషయంలో కేర్ ఫుల్ గా ఉండనున్నట్లు స్పష్టం చేస్తున్నారు.  

తిరిగి ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద ప్రయాణించే వాహనాలకు పెద్ద ఎత్తున ఆంక్షల్ని విధిస్తున్నారు. ఈ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. వాహనాలు వెళ్లే తీరును తాము గమనిస్తుంటామని.. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ మీద పెద్ద ఎత్తున సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో వాహనాల రాకపోకల్ని పర్యవేక్షిస్తుంటారు. ఎవరు తప్పు చేసినా.. ఆ వాహనం నెంబరును నోట్ చేసుకొని చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్  ప్రజలకు పెద్దగా పరిచయం లేని లైన్ మేనేజ్ మెంట్ ను ఈ ఫ్లైఓవర్ మీద పక్కాగా అమలు చేయనున్నారు.

లైన్ మేనేజ్ మెంట్ అంటే.. రోడ్డుకు ఉండే గీతల క్రమంలోనే వాహనాన్ని నడపాలి. అంతేకాదు.. ఇష్టారాజ్యంగా నడిపితే చర్యలు తీసుకుంటారు. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ విషయానికి వస్తే.. ఎడమ వైపు ఉన్న లేన్ లోనే టూవీలర్లను నడపాలి. మిగిలిన లైన్లలో కార్లను నడపాల్సి ఉంటుంది. ఎవరైనా పొరపాటున లైన్ మేనేజ్ మెంట్ ను పాటించకుంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

అంతేకాదు.. ఈ ఫ్లైఓవర్ మీద వాహనాల్ని గరిష్ఠంగా 40 కి.మీ. మించకూడదు. సెల్ఫీల కోసం కానీ మరే కారణం మీద కానీ ఫోటోలు తీసుకునేందుకు ఆగకూడదు. ఫ్లైఓవర్ మీద నడను నిషేధించారు. వాహనాల మధ్య దూరాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. భారీ వాహనాల్ని ఈ ఫ్లైఓవర్ మీదకు అనుమతించరు. ఓవర్ స్పీడ్ మీద వెళ్లే వాహనాల్నిగుర్తించి.. ఫైన్లు విధిస్తారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు సైతం ఫైన్లు వేస్తారు. నిబంధనల్ని ఉల్లంఘిచే వారిని సీసీ కెమేరాల ద్వారా గుర్తించి.. వారికి అప్పటికప్పుడే ఆడియో సిస్టం ద్వారా హెచ్చరికలు జారీ చేయనున్నారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.


Tags:    

Similar News