మాల్యా ఇంటిని సొంతం చేసుకున్న హైదరాబాద్ సంస్థ

Update: 2021-08-15 05:30 GMT
వ్యాపారవేత్తలకు గ్లామర్ ఏముంటుంది? అన్న ప్రశ్న మళ్లీ వినిపించకుండా చేయటమే కాదు.. అసలు గ్లామర్ అంతా బిజినెస్ మ్యాన్లదే అన్న ఇమేజ్ ను తీసుకురావటం అంత తేలికైన విషయం కాదు. అందులో నూటికి నూరుశాతం సక్సెస్ సొంతం చేసుకున్న వ్యాపారవేత్త ఎవరైనా ఉన్నారంటే అది కింగ్ ఫిషర్ విజయ్ మాల్యానేనని చెప్పాలి. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్ గా.. ఆయన్ను చూసి ఆసూయ పడని వారంటే ఎవరూ ఉండరన్నట్లుగా ఉన్న ఆయన జీవితం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఒక్కసారిగా మార్చేసింది. కింగ్ ఆఫ్ గుడ్ టైంగా పేరున్న విజయ్ మాల్యా.. కింగ్ ఆఫ్ బ్యాడ్ టైంగా మారిపోయారు.

ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టినంతనే నష్టాలు విరుచుకుపడటం.. వాటిని అధిగమించేందుకు బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన నిధులు ఏ మాత్రం సరిపోకపోవటంతో పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సి వచ్చింది. చివరకు ఆ భారం రూ.9వేల కోట్లకు చేరుకోవటంతో.. చేతిలో ఉన్న సొమ్ముల్ని తీసుకొని చెప్పాపెట్టకుండా దేశం విడిచి గుట్టుగా పారిపోయారు. చివరకు ఆయన బ్రిటన్ లోని విలాసవంతమైన విల్లాలో ఉన్న విషయం తెలిసిందే.

ఆయనపై న్యాయపోరాటం చేస్తూ.. దేశానికి తిరిగి వచ్చేలా చేయటం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. మరోవైపు.. బ్యాంకుల వద్ద ఆయన తీసుకున్న రుణాల్ని తిరిగి రాబట్టుకునేందుకు వీలుగా ఆయన ఆస్తుల్ని వేలానికి పెట్టారు. తాజాగా ముంబయి లోని విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ సొంతం చేసుకుంది. ముంబయి ఎయిర్ పోర్టుకు దగ్గర్లో విల్లేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్ ను బ్యాంకులు వేలం వేశాయి.

తొలుత ఈ విలాసవంత భవనానికి బేస్ ప్రైస్ గా రూ.150 కోట్లుగా బ్యాంకులు నిర్ణయించాయి. దీంతో.. దాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 2016 నుంచి బ్యాంకుల కన్సార్టియం ఈ భవనాన్ని వేలం వేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో.. ప్రారంభ ధరను భారీగా తగ్గించేసి.. తాజాగా రూ.52 కోట్లతో షురూ చేశారు. దీంతో హైదరాబాద్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ.. ఈ భవనాన్ని ప్రారంభ ధరకే సొంతం చేసుకుంది. దీంతో.. మాల్యా విలాస భవంతి హైదరాబాద్ సంస్థకు సొంతమైంది.
Tags:    

Similar News