1000 కోట్ల డిపాజిట్లు...టీటీడీపై హైకోర్టు ఫైర్!

Update: 2018-05-01 17:09 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు స‌భ్యుల నియామ‌కాల్లో టీడీపీ స‌ర్కార్ వైఖ‌రిపై స‌ర్వ‌త్రా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే అనిత‌ను బోర్డు స‌భ్యురాలిగా నియ‌మించ‌డంపై ప‌లువురు ఆధ్యాత్మిక వేత్త‌లు మండిప‌డ్డారు. అన్య‌మ‌త‌స్థురాలైన అనితను స‌భ్యురాలిగా ఎలా నియమించారంటూ నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ వివాదం చెల‌రేగ‌డంతో అనిత‌....త‌న‌ను స‌భ్యురాలిగా త‌ప్పించాలంటూ చంద్ర‌బాబుకు లేఖ రాశారు. దీంతో, అనిత‌ను తొల‌గిస్తూ చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా, టీటీడీ పేరు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. టీటీడీ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీకి చెందిన 1000 కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంపై కోర్టు మండిప‌డింది. 4 వారాల్లోగా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని టీటీడీని ఆదేశించింది.

టీటీడీ తీరుపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇన్ని జాతీయ బ్యాంకులుండ‌గా వాటిని కాదని, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించింది. భారీ స్థాయిలో ఉన్న నిధుల భద్రత క‌న్నా వ‌డ్డీ ముఖ్యమా...అంటూ ప్రశ్నించింది. ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేయడంపై హైకోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ వాద‌న‌ల‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. అంతేకాకుండా, 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల‌ని టీటీడీని ఆదేశించింది. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి దాఖ‌లు చేసిన పిల్ పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు పై విధంగా స్పందించింది. టీటీడీ క‌నీస‌ నిబంధనలు పాటించుకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో దాదాపు 1000 కోట్లు డిపాజిట్ చేసిందని న‌వీన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ పిల్ ను విచార‌ణ చేసిన హైకోర్టు ...టీటీడీని వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది.


Tags:    

Similar News