ఏంది క‌రాచీ బేక‌రి.. అంత ఆరాచ‌క‌మా?

Update: 2017-10-05 05:40 GMT
పేరు ప్ర‌ఖ్యాత‌లకు లోటు లేకున్నా.. క‌క్కుర్తితో కొన్ని వ్యాపార సంస్థ‌లు చేసే ప‌నులు వింటే అవాక్కు అవ్వాల్సిందే. పేరును చూసి.. వాటికున్న ఘ‌న చ‌రిత్ర‌ను చూసి న‌మ్మ‌కంగా కొనేసే వారిని బ‌క‌రాలు చేసేలా స‌ద‌రు వ్యాపార సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న్న విష‌యం అవాక్కు అయ్యేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా అలా బ‌య‌ట‌కు వ‌చ్చి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది క‌రాచీ బేక‌రి బ్రెడ్ వివాదం.

క‌రాచీ బేక‌రీ అన్న వెంట‌నే.. ఆ బ్రాండ్‌ కున్న పేరు ప్ర‌ఖ్యాతులు గుర్తుకు వ‌స్తాయి. ఆ వ్యాపార సంస్థ‌లో వ‌స్తువులంటే చాలు నాణ్య‌త‌కు ఢోకా ఉండ‌ద‌న్న భావ‌న అంద‌రిలో ఉంది. మ‌రి.. అలాంటి న‌మ్మ‌కం మీదే దెబ్బ ప‌డే ఉదంతం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. బంజారాహిల్స్ లోని క‌రాచీ బేక‌రీ  బ్రాంచ్ లో ఒక వినియోగ‌దారుడు బ్రెడ్ కొనుగోలు చేశాడు.

ప్యాకింగ్ తేదీ అక్టోబ‌రు 5 అని ఉంది. అయితే.. ఆ బ్రెడ్‌ను స‌ద‌రు వినియోగ‌దారుడు కొనుగోలు చేసింది అక్టోబ‌రు 4నే. త‌ర్వాతి రోజు త‌యారు చేస్తున్న‌ట్లుగా చెప్పే ప్యాకెట్ల‌ను ముందురోజే అమ్మ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మైంది. క‌రాచీ బేక‌రి తీరును త‌ప్పు ప‌డ‌తూ స‌ద‌రు వినియోగ‌దారుడు తాను కొన్న బ్రెడ్ పాకెట్‌ ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో.. ఇది కాస్తా వైర‌ల్ అయ్యింది. ప్ర‌ముఖ బేక‌రీగా పేరున్న క‌రాచీ ఇలాంటి ప‌ని చేయ‌టం ఏమిట‌న్న మాట ప‌లువురి నోట వినిపించింది. ఈ నేప‌థ్యంలో తూనిక‌లు కొల‌త‌ల శాఖ అధికారులు క‌రాచీ బేక‌రీకి సంబంధించి సిటీలోని నాలుగు బ్రాంచీల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 18 ఫుడ్ ఐట‌మ్స్‌ పై కేసులు న‌మోదు చేశారు.

ప్యాకింగ్ వివాదంపై కరాచీ బేక‌రి రియాక్ట్ అయ్యింది. సిబ్బంది నిర్ల‌క్ష్యంతోనే త‌ప్పు జ‌రిగిందంటూ తప్పు వెన‌కున్న కార‌ణంగా చెప్పొకొచ్చింది. ఒక‌వేళ‌.. సిబ్బంది నిర్ల‌క్ష్యంతో డేట్ విష‌యంలో త‌ప్పు ఉందంటే.. మ‌రి తూనిక‌లు కొల‌త‌ల శాఖాధికారులు మ‌రో 18 ఫుడ్ ఐటెమ్స్ మీద కేసులు ఎందుకు న‌మోదు చేసిన‌ట్లు?
Tags:    

Similar News