హైదరాబాద్ మార్కెట్లు బంద్.. ఎప్పటి నుంచి అంటే?

Update: 2020-06-26 04:04 GMT
నిత్యం కిటకిటలాడుతూ కళకళలాడే మార్కెట్లు హైదరాబాద్ లో చాలానే ఉన్నాయి. దాదాపు ఏడు వేల కిలోమీటర్లు విస్తరించిన మహానగరంలో ఒక బేగం బజార్.. ఒక సిద్ది అంబర్ బజార్.. ఒక లాడ్ బజార్.. ఒక ప్యారడైజ్ పాయింట్.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని మార్కెట్లు కనిపిస్తాయి. అయితే.. ఇప్పుడా మార్కెట్లు అన్ని ఒకరు తర్వాత ఒకరు చొప్పున స్వీయ లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.

రోజురోజుకు హైదరాబాద్ లో పెరిగిపోతున్న కేసుల దెబ్బతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏ మూల ఏ ప్రమాదం పొంచి ఉందన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది. కాలు తీసి కాలు బయటకు పెట్టటమంటే ఆరోగ్యానికి ముప్పేనన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళలో.. రద్దీ ప్రాంతాలు గా ఉండే వ్యాపార కూడళ్లు.. హోల్ సేల్ మార్కెట్లు.. ప్రముఖ మార్కెట్ల ద్వారా మహమ్మారి మరింత వ్యాపించే వీలుంది.

అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపార సంస్థల్ని మూసివేయాలని ప్రభుత్వం చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. వ్యాపారులే స్వచ్ఛందం గా ఎవరికి వారు ముందుకొచ్చి తమ మార్కెట్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం (జూన్ 26) నుంచి వచ్చే ఆదివారం (జులై 5) వరకూ షాపుల్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

హైదరాబాద్.. సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు మార్కెట్లలోని వ్యాపార సంస్థలు ఈ నిర్ణయాన్ని వెల్లడించాయి. తాజా నిర్ణయంతో.. కిరాణం దగ్గర నుంచి వెండి.. బంగారం వరకూ అన్ని మార్కెట్లు బంద్ చేయాలని డిసైడ్ చేశారు. సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. అందుకు భిన్నంగా వ్యాపార సంస్థలే సొంతంగా తమకు తాము స్వీయ లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. మార్కెట్లను మూసివేయాలని స్థానిక వ్యాపారులు నిర్ణయం తీసుకున్న వేళ.. నగరప్రజలుసైతం ఎవరికి వారుగా స్వీయ నియంత్రణతో అవసరమైతే తప్పించి ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండటం చాలా అవసరమన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News