హైదరాబాద్ మెట్రో ఆఫర్ అదిరింది.. ఆ రూట్లో ఛార్జీ రూ.15

Update: 2021-10-15 05:30 GMT
కరోనా దెబ్బకు చాలా రంగాలు తీవ్రంగా ప్రభావితం కావటమే కాదు.. భారీ నష్టాల్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. వినోద.. టూరిజం.. రవాణా రంగాలపై పడిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న పరిస్థితి. థర్డ్ వేవ్ అని చెబుతున్నా.. ఇప్పటివరకు అలాంటి జాడలేమీ కనిపించకపోవటం.. మరో రెండు నెలలు పాటు కేసుల పెరుగుదల పెద్దగా లేని పక్షంలో.. కరోనా నుంచి బయటపడినట్లేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ మెట్రో భారీ ఆఫర్లను ప్రకటించింది.

కరోనాకు ముందు హైదరాబాద్ మెట్రో లో ప్రయాణికుల సందడి ఒక రేంజ్లో ఉండేది. రోజుకు నాలుగైదు లక్షల మంది ప్రయాణికులు మెట్రోను ఉపయోగించుకునే వారు. కరోనాతో మొదలైన ఇబ్బంది అంతకంతకూ పెరిగిపోవటమేకాదు.. రోజుకు లక్ష మంది ప్రయాణించే పరిస్థితి లేని దుస్థితి. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఇలాంటి వేళ.. ప్రయాణికులకు మరింత ఉత్సాహం కలిగించేలా.. మెట్రోలో ప్రయాణించేందుకు వీలుగా సరికొత్త ఆఫర్లతో ముందుకు వచ్చారు.

గతంలోనూ ఆఫర్లు ఉన్నప్పటికి.. ఈసారి మరింత వినూత్నంగా ఆఫర్లు ఉన్నాయని చెప్పాలి. హైదరాబాద్ మెట్రో రూట్లలో పెద్దగా ఆదరణ లేని ఎంజీబీఎస్.. జేబీఎస్ రూట్ల మధ్యన భారీ ఆఫర్ ను ప్రకటించింది హైదరాబాద్ మెట్రో. ఈ రెండు స్టేషన్ల మధ్య ఛార్జీ రూ.35. తాజా ఆఫర్ కింద ఈ రూట్లో ఏ స్టేషన్ నుంచి మరే స్టేషన్ వరకైనా కేవలం రూ.15 మాత్రమే వసూలు చేసేలా టికెట్ ధరను నిర్దారించారు. అంటే సీబీఎస్ లో టికెట్ తీసుకొని రూట్ లో చివరి స్టేషన్ అయిన జేబీఎస్ వరకు వెళ్లినా రూ.15 చెల్లిస్తే సరిపోతుంది. ఈ కొత్త ఆఫర్ తో తక్కువ ధరకు.. చాలా వేగంగా ప్రయాణించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ ఆఫర్ నుంచి ఇవాల్టి నుంచి (అక్టోబరు 15) 2022 జనవరి 15 వరకు అమలు చేయనున్నారు.

మరో రెండు ఆఫర్లను కూడా హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. వాటి వివరాల్లోకి వెళితే..
30 ట్రిప్పులు కేవలం 20 ట్రిప్పుల ధరతో: ఈ ఆఫర్‌ కింద మెట్రో ప్రయాణీకులు తమ ప్రయాణానికి అనుగుణంగా ఏదైనా ఫేర్‌తో 30 ట్రిప్పులను కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన పాస్ ను 45 రోజుల లోపు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ కేవలం మెట్రో స్మార్ట్‌ కార్డ్ పాత..కొత్త కార్డులపైనా వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను 18 అక్టోబర్‌ 2021 నుంచి 15 జనవరి 2022 మధ్యన లభిస్తుంది.

లక్కీ డ్రా: అక్టోబర్‌ 2021 నుంచి ఏప్రిల్‌ 2022 వరకూ ఆకర్షణీయమైన బహుమతులను ప్రతినెలా గెలుచుకునే అవకాశం లభించనుంది. ప్రతి నెలా ఐదుగురు మెట్రో ప్రయాణికుల్ని విజేతలుగా లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఒక నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే.. ప్రయాణికులు ఈ డ్రాలో పాల్గొనాలంటే తమ వివరాల్ని ఆయా మెట్రో స్టేషన్ల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News