లాక్‌డౌన్ ఉల్లంఘించిన 35 వేల వాహ‌నాలు సీజ్‌..

Update: 2020-04-17 01:30 GMT
కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించారు. తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప‌క‌డ్బందీగా సాగుతుండ‌గా.. హైద‌రాబాద్ వంటి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ప్ర‌జ‌లు బేఖాత‌ర్ చేస్తున్నారు. య‌థేచ్ఛ‌గా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ ఆరుబ‌య‌ట తిరుగుతున్నారు. ప‌ని లేకుండానే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. అయితే అలాంటి వారిపై ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంది. లాక్‌డౌన్ వేళ ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వాల‌ని సూచిస్తున్నా బ‌య‌ట‌కు రావ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించి వారి వాహ‌నాల‌ను సీజ్ చేయ‌డంతోపాటు వారి వాహ‌నాల‌ను సీజ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒక్క హైద‌రాబాద్‌లోనే దాదాపు 35 వేల‌కు పైగా వాహ‌నాల‌ను పోలీసులు సీజ్ చేశారంట‌. లాక్‌డౌన్ అనంత‌రం ఆ వాహ‌నాలు పొందాలంటే వారికి చుక్క‌లు క‌నిపించేలా ప‌రిస్థితులు ఉన్నాయి. వారికి జైలు శిక్ష ప‌డ‌డంతో పాటు జ‌రిమానా కూడా విధించే అవ‌కాశం ఉంద‌ని పోలీస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో మొత్తం మూడు క‌మిష‌న‌రేట్‌ లు ఉన్నాయి. హైద‌రాబాద్‌, సైబరాబాద్, రాచకొండ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో లాక్‌డౌన్‌ ను పోలీసులు పటిష్టంగా అమలుచేస్తున్నారు. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్‌ ను ఉల్లంఘించి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారి వాహనాల‌ను సీజ్ చేస్తున్నారు. అకారణంగా రోడ్డెక్కిన వాహ‌నాల‌ను పోలీసులు స్టేష‌న్‌ కు త‌ర‌లిస్తున్నారు. లాక్‌డౌన్‌ వేళ ఐపీసీ 188 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వాహ‌న‌ దారుల‌కు జైలుశిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ను హైద‌రాబాద్‌ తో పాటు శివారు ప్రాంత ప్రజలు ఉల్లంఘిస్తున్నారు. బైక్‌ పై ఒకరికి మించి, కారులో ఇద్దరికి మించి ప్రయాణం చేస్తున్నారు. దీనికి తోడు అన‌స‌వ‌రంగా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. మరికొందరు సరైన వాహన పత్రాలు లేకుండా వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో తనిఖీలు చేస్తున్న స‌మ‌యంలో పోలీసుల‌కు దొరికిపోతున్నారు. ఆ విధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో 35 వేల వాహనాలు సీజ్‌ అయ్యాయి. ఆ వాహ‌నాల‌తో పోలీస్‌స్టేష‌న్లు నిండిపోయాయి. స్థ‌లాభావంతో ప‌లు ప్రైవేటు స్థ‌లాల్లో ఆ వాహ‌నాల‌ను నిలిపి ఉంచాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఖాజాగూడలోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్, కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌ వెనక, మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్, ఆఅబిడ్స్‌లోని గోషామహల్‌ స్టేడియం, అంబర్‌పేటలోని కార్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆ వాహ‌నాలను పార్క్‌ చేస్తున్నారు.

లాక్‌డౌన్ ముగిసిన అనంత‌రం ఆ వాహ‌న‌దారులంతా పోలీస్ స్టేష‌న్‌, కోర్టుల చుట్టూ తిర‌గాల్సిందే. అలాంటి కేసులు భారీగా పేరుకుపోవ‌డంతో వాహ‌నం చేతికి అందాలంటే దాదాపు మూడు నెల‌ల పాటు ఆగాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇన్ని తిప్ప‌లు ఎందుకు.. లాక్‌డౌన్ వేళ ప్ర‌శాంతంగా ఇంట్లో ఉండొచ్చు క‌దా అని పోలీసులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News