స్పానిష్ ఫ్లూ తరహాలోనే కరోనా ఖతం అవుతుందా?

Update: 2020-07-11 02:30 GMT
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు దాదాపు రెండువేల కేసులు నమోదవుతుండడంతో నగరవాసులు మహమ్మారి వైరస్ పేరు చెబితేనే బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్ నగరంలో మరిన్ని కేసులు నమోదయ్యే చాన్స్ ఉందని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, హైదరాబాద్ ప్రజలకు ఇటువంటి వైరస్ లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఘన చరిత్ర ఉందని నిజాం నవాబు డెక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ మహమ్మద్ సఫీవుల్లా వెల్లడించారు. 1918లో స్పానిష్ ఫ్లూ ప్రపంచంతోపాటు హైదరాబాద్ ను కూడా అతలాకుతలం చేసిందని, అప్పుడు జనం దానిని దీటుగా ఎదుర్కొని హెర్డ్ ఇమ్యూనిటీ సాధించారని వెల్లడించారు. అందుకే, స్పానిష్ ఫ్లూ నుంచి ప్రజలను ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన వైద్య సిబ్బందకి నాటి నిజాం సర్కారు మెడల్స్ తో సత్కరించిందని వెల్లడించారు.

2020లో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తీరు 1918 నాటి స్పానిష్ ఫ్లూ విజృంభణను గుర్తు చేస్తోంది. నాడు కూడా వైరస్ వ్యాప్తి చెందుతోన్న తొలినాళ్లలో కొద్ది మందే ఫ్లూ బారిన పడ్డారు. 1918 సెప్టెంబర్ నాటికి వైరస్ తీవ్రత పెరిగి...1918 అక్టోబర్ లో గరిష్టానికి ఆ తర్వాత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అక్టోబర్ చివరి కల్లా నగరవాసులు హెర్డ్ ఇమ్యూనిటీని (తట్టుకునే శక్తిని) పొందారు. స్పానిష్ ఫ్లూ వల్ల 1918 సెప్టెంబర్ నాటికి ప్రతి 1000 మందికి గాను 45.56(దాదాపుగా 46 మంది) మంది చనిపోయారు. 1911-1921 దశాబ్దంలో వచ్చిన ప్లేగు వల్ల 194,325 మంది, కలరా వల్ల 42,246 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అదే తరహాలో కరోనా కేసులు కూడా నమోదయ్యాయి. గత రెండువారాలుగా తెలంగాణలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండడంతో కలవరం మొదలైంది. అయితే, ఒకసారి కేసులన్నీ పీక్ స్టేజ్‌కు చేరిన తర్వాత ఇన్ఫెక్షన్ ప్రభావం తగ్గుముఖం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రతి ఇద్దరిలో ఒకరు ఫ్లూ బారిన పడ్డారని అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News