నేను నాన్నలా కాదు: కేటీఆర్

Update: 2019-01-24 10:08 GMT
రెండోసారి గెలుపు టీఆర్ ఎస్ ను తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చింది. ఆ బలం, బాధ్యతతో కేసీఆర్ అండ్ కేటీఆర్ లు ఫుల్ జోష్ లో ముందుకు సాగుతున్నారు. అయితే తండ్రి కేసీఆర్ గెలిచాక కాస్త సంయమనం పాటించాలని.. ఎన్నికల ముందు జరిగిన విషయాలను వదిలేయాలని పార్టీ శ్రేణులకు  మొదటి ప్రెస్ మీట్ లోనే సూచించారు. కానీ కేటీఆర్ మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు.  తమను ఓడించేందుకు కుట్ర పన్నిన వారికి తగిన బుద్ది చెప్పేలానే కనిపిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల వేళ రెండు తెలుగు పత్రికలు, పలు చానళ్లు  అప్పటి వరకు టీఆర్ ఎస్ కు బ్రహ్మరథం పట్టి.. చంద్రబాబు రంగ ప్రవేశంతో కాంగ్రెస్ కు ప్రచారం చేశాయి. దాదాపు కాంగ్రెస్ గెలుస్తుందంటూ గోబెల్స్ ప్రచారం చేశాయి. ఆ ప్రచారం చూసి కేటీఆర్, కేసీఆర్ సైతం ఢీలా పడ్డారు. ధైర్యం కోల్పోయారు. కానీ ప్రజలు టీఆర్ ఎస్ కే పట్టం కట్టడంతో కేసీఆర్ ఈ విషయాన్ని వదిలేసినా కేటీఆర్ లో మాత్రం ఆ బాధ రగులుతూనే ఉంది. తాజాగా జర్నలిస్టు మిత్రుడు కం ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్  అభినందన సభలో కేటీఆర్  మనోవేధన తేటతెల్లమైంది.

కేసీఆర్ ఇక తెలంగాణలో తనకు  ప్రత్యర్థులు బలంగా  లేరని... అభివృద్ధి వైపు పయనిస్తుండగా.. కేటీఆర్ మాత్రం తమ ప్రత్యర్థుల గురించి బహిరంగంగా మాట్లాడుతూ వారికి హెచ్చరికలు పంపుతున్నారు. క్రాంతికిరణ్ అభినందన సభలో కేటీఆర్ చేసిన ఈ హెచ్చరికలు హాట్ టాపిక్ గా మారాయి.

ఇక ఆ తర్వాత జర్నలిస్టు మిత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్.. ‘తన తండ్రి మాదిరిగా తనకు ఉదారత్వం లేదని.. తమను.. తమ పార్టీని నష్టపరిచేలా చేసే చర్యల్ని తాను ఉపేక్షించనని’ వారితో చెప్పడం సంచలనం రేపుతోంది. ఎన్నికల వేళ టీఆర్ ఎస్ ను దెబ్బతీసేందుకు కుట్రపన్నిన మీడియాను, నాయకులను అంత ఈజీగా వదిలిపెట్టనని కేటీఆర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
    

Tags:    

Similar News