నేను సీఎం జగన్‌ ను సైకో అనలేదు: వైసీపీ నేత వ్యాఖ్యలు!

Update: 2023-02-02 15:49 GMT
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో కృష్ణా జిల్లా గన్నవరం మరో కాక రేపుతోంది. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉదంతాలు చల్లారకముందే ఈసారి కృష్ణా జిల్లా గన్నవరం ఇందుకు వేదికైంది. కృష్ణా జిల్లాలో ఆప్త మిత్రులుగా ఉన్న గన్నవరం, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై సొంత పార్టీ నేతల తాజా వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

తాజాగా గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ముఖ్య నేతలు.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు, వైసీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావులు.. వల్లభనేని వంశీ, కొడాలి నానిపైన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు మాట్లాడినట్లు చెబుతున్న సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇప్పటికే పలుమార్లు వైసీపీ అధిష్టానం యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు, వల్లభనేని వంశీల మ«ధ్య సయోధ్య కుదిర్చింది. అయితే యార్లగడ్డ, దుట్టా వర్గాలు వంశీని తమ నాయకుడిగా గుర్తించడం లేదు. వంశీతో పాటు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిలను తాజాగా వివాదంలోకి లాగడం చర్చనీయాంశమైంది.

ఇటీవల గుంటూరు జిల్లా వైకుంఠపురంలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొడాలి నాని, వల్లభనేని వంశీపై వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలను ఎవరో రికార్డ్‌ చేయడంతో అవి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ప్రైవేటు సంభాషణలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. తన గురించి, కొడాలి నాని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వార్డు మెంబరుగా కూడా గెలవలేని వారి సాయం తనకు అవసరం లేదని దుట్టా, యార్లగడ్డలపై మండిపడ్డారు. తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేవారి సంగతి తామే తేల్చుకుంటామని వంశీ హెచ్చరించారు.

కాగా.. సీఎం జగన్‌ ను తాను సైకో అన్నానంటూ మీడియాలో వస్తున్న వార్తలను దుట్టా రామచంద్రరావు ఖండించారు. గుడి ప్రారంభోత్సవం నిమిత్తం తాను, యార్లగడ్డ వెంకట్రావు కలుసుకున్నామని తెలిపారు. అయితే సీఎం జగన్‌ ను సైకో అని తామిద్దరం అన్నామంటూ కొన్ని ఛానళ్లు ప్రచారం చేశాయని ధ్వజమెత్తారు. సైకో అని తాము ఏమీ అనలేదని తేల్చిచెప్పారు.

తాను 40 సంవత్సరాల నుండి నేను డాక్టరుగా ఉన్నానని దుట్టా రామచంద్రరావు తెలిపారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబానికి తమకు దగ్గర సంబంధం ఉందన్నారు. తాను చచ్చిపోయే వరకు మా కుటుంబ సభ్యులు జగన్‌తోనే ఉంటామన్నారు. వల్లభనేని వంశీతో కలిసి ప్రయాణం చేయమని అధిష్టానం చెప్పిందని తెలిపారు. అయితే వంశీతో కలిసి తాను ప్రయాణం చెయ్యను అని అధిష్టానానికి చెప్పానన్నారు.

వంశీతో గొడవ పడవద్దని అధిష్టానం తనకు చెప్పిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం మాటకే తాను కట్టుబడి ఉన్నానన్నారు. యార్లగడ్డ వెంకట్రావు కూడా వైసీపీ పార్టీకి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను తిట్టే మనస్తత్వం తమది కాదని తేల్చిచెప్పారు. అందరం సరదాగా కూర్చుని మాట్లాడుకునే టైంలో ఎవరు తమ సంభాషణలను రికార్డ్‌ చేశారో తెలియదన్నారు. ఆ రికార్డులో అనకూడని మాటలు ఏమీ లేవు అని దుట్టా రామచంద్రరావు స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News