ప‌వ‌న్-కు మ‌రో వ‌ర‌ప్ర‌సాదు దొరికేశాడు!

Update: 2022-06-24 03:15 GMT
జ‌న‌సేన గూటిలోకి మ‌రో విశ్రాంత  ఐఏఎస్ అధికారి దేవ‌ వ‌ర‌ప్ర‌సాద్ (స్వ‌స్థ‌లం : రాజోలు) చేరారు. దీంతో పార్టీ బ‌లోపేతానికి ఆయ‌న ఇక‌పై కృషి చేయ‌నున్నారు. ఈ  మేరకు ఆయ‌న చేరికతో తూర్పుగోదావ‌రి వాకిట మ‌రో చ‌దువుకున్న ముఖం ఒక‌టి వెలిగిపోనుంది అని భావిస్తోంది జ‌న‌సేన. ఇప్ప‌టికే అనేక చోట్ల ప‌నిచేసి వ‌చ్చిన ఆయ‌న ఇక‌పై త‌న పూర్తిసేవ‌లు జ‌న‌సేన‌కే అందిస్తానని చెబుతూ ఉన్నారు.

విశ్రాంత ఐఏఎస్ అధికారి  దేవ‌ వ‌ర‌ప్ర‌సాద్ రాక‌తో జ‌న‌సేన పార్టీ లో మ‌ళ్లీ చ‌ర్చ మొద‌లయింది. ఆయ‌న్ను  క‌నుక రాజోలు బ‌రిలో దింపితే రాపాక‌కు కౌంట‌ర్ ఇచ్చినట్ల‌వుతుంద‌ని భావిస్తోంది. తొలుత జ‌న‌సేన నుంచి టికెట్ పొంది, గెలుపు సాధించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద‌ రావు ఎంత‌గా ఆ పార్టీ వ‌ర్గాల‌ను ఇర‌కాటంలో పెట్టారో తెలిసిందే ! ప‌ద‌వి అందుకున్న ద‌గ్గర నుంచి వైసీపీ భ‌జ‌న‌లోనే ఆయ‌న ఉండిపోయారు అని ఇప్ప‌టికీ జ‌న‌సేన మండిప‌డుతూ వీలున్న ప్ర‌తిసారీ ఆయ‌న్ను తిడుతూనే ఉంది.

అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఎక్క‌డా త‌గ్గ‌లేదు. జగన్-కు ఉన్న‌ట్టుండి విధేయుడిగా మారిపోయారు. తాను ప‌వ‌న్ బొమ్మ‌తో గెల‌వ‌లేద‌ని చెప్పారు. అదేవిధంగా త‌న‌ను తిట్టిపోసిన జ‌న‌సైనికుల‌ను ఉద్దేశించి కూడా ఆగ్రహంతో ఊగిపోయారే త‌ప్ప ! త‌ప్పు తెలుసుకోలేదు. తాజాగా అదే రాజోలు నియోజ‌క‌వ‌ర్గం, దిండి గ్రామానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి దేవ వ‌ర‌ప్ర‌సాద్ ఇవాళ జ‌న‌సేన పార్టీలో ప‌వ‌న్ సమ‌క్షంలో చేర‌డం విశేషం. ఆయ‌న చేరిక‌ను ధ్రువీక‌రిస్తూ జ‌న‌సేన ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది కూడా!

గ‌తంలో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి ఉన్న‌తాధికారులు జ‌న‌సేన వెంట న‌డిచి త‌రువాత త‌ప్పుకున్నారు. ఆ త‌రువాత కూడా కొందరు ఉన్న‌తాధికారులు పద‌వీ విర‌మ‌ణ అనంత‌రం ఇటుగా వ‌చ్చేందుకు ఉత్సాహం చూపి త‌రువాత వెన‌క్కు త‌గ్గారు.

ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) కి మంచి రోజులు వ‌స్తే అందులోకే వెళ్దామ‌ని డిసైడ్ అయి ఆగిపోయిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. ప‌వ‌న్ పార్టీలో జాయిన్ అయి అక్కడి ప‌రిణామాల‌ను అర్థం చేసుకోలేక, ఇమ‌డ లేక వెన‌క్కు రావ‌డం క‌న్నా ఆప్ కే వెళ్తే బాగుంటుంది అన్న అభిప్రాయంలో వారు ఉండిపోయారు కూడా !

కానీ ఈ విశ్రాంత అధికారి మాత్రం ప‌వ‌న్ వెంటే న‌డుస్తాన‌ని స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు. మ‌రి ! వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాపాక‌కు పోటీగా ఈయ‌న ఉండ‌నున్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డి, అభివృద్ధి చెందాలంటే మంచి నాయ‌క‌త్వం అవ‌స‌రం అని, అది ప‌వ‌న్ క‌ల్యాణ్ ద్వారానే సాధ్య‌మ‌వుతుంది అని చెప్పారాయ‌న‌. ఆ న‌మ్మ‌కంతోనే పార్టీలో చేరాను అని, జ‌న‌సేన‌తోనే క‌లిసి ప్ర‌యాణిస్తాన‌ని అంటున్నారాయ‌న‌.
Tags:    

Similar News