తెలుగోళ్లు తెలివైనోళ్లు.. గుజరాత్ లో కలివిడిగా ఉండాలా?

Update: 2016-02-08 04:03 GMT
దేశంలో అత్యున్నత క్యాడర్ గా పేరొందిన ఐఏఎస్ లకు ఏడాది పాటు శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత వారికి పోస్టింగ్ ఇవ్వటం తెలిసిందే. ఏడాది పాటు సాగే ట్రైనింగ్ లో వారికేం విషయాలు చెబుతారన్న విషయం ఆసక్తికరం. అదే సమయంలో వారికి అందించే కరదీపికలో ఏమేం చేయాలి? ఏం చేయకూడదన్న సమాచారంతో పాటు.. ఎలా మెలగాలి? ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న విషయాల్ని ప్రత్యేకంగా పేర్కొంటారు.

వీటిని ట్రైనీ ఐఏఎస్ లు తమ శిక్షణ కాలంలో తమకు లభించిన అనుభవాలతో ఈ పుస్తకాలు సిద్ధమవుతాయి. తాజాగా ఒక మీడియా సంస్థకు ఈ బుక్ దొరికింది. దీన్లో.. ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అక్కడి ప్రజల వైఖరి.. పనితీరు లాంటి అంశాలతోకూడిన ఆసక్తికర సమాచారం ఉంది. ఏ రాష్ట్రంలో ఎలాంటి పని తీరు ఉంటుందన్న విషయంపై అవగాహన వీరి అనుభవాల మాటల్ని వింటే ఇట్టే అర్థమవుతుంది.

మరి రాష్ట్రాల వారీగా ఎలా ఉంటారన్నది చూస్తే..

ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లోపని చేసే వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. తెలుగు ప్రజలు తెలివైనోళ్లు. వారికి తమ హక్కుల పట్ల పూర్తి అవగామన ఉంటుంది. కోస్తా.. రాయలసీమలో ఎప్పటికప్పుడు రికార్డులు అప్ డేట్ చేస్తుంటారు. తెలంగాణలో ఈ తరహా పని కాస్త ఆలస్యంగా సాగుతుంది. తహసిల్దారే అని చిన్న చూపు చూడొద్దు.. తెలుగు రాష్ట్రాల్లో తహసిల్దారు.. ఆర్డీవో.. డీఆర్వోలను గౌరవిస్తే వారి నుంచి ఎంతో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా బయటకు వెళ్లొద్దు. సెలవులు తీసుకోండి కానీ అదే పనిగా మాత్రం వద్దు.

తమిళనాడులో

పని తీరు బావుంటుంది. తమిళనాడు ప్రభుత్వం అధికారుల్ని బాగా చూసుకుంటుంది. రూల్స్ ప్రకారమే పని ఉంటుంది. తమిళనాడులో గన్ మ్యాన్ ని ఆశించొద్దు. ఒకవేళ అడిగినా అక్కడి ప్రభుత్వం గన్ మ్యాన్ ను ఇవ్వదు.

కర్ణాటకలో

ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చాలా పవర్ ఫుల్. అవినీతి.. బంధుప్రీతి ఎక్కువ. కెరీర్ లో రాణించాలంటే కన్నడ నేర్చుకోవాలి. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాజకీయ నేతలు తరచూ అధికారులపై ఫిర్యాదులు చేస్తుంటారు.

కేరళ

ఇక్కడంతా సానుకూల వాతావరణం ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్లతో గొడవలొద్దు. కేరళ ప్రజలు విద్యావంతులు అన్ని అంశాల మీద అవగాహన ఎక్కువ. పాలనలో ప్రాశ్చాత్య ధోరణి కనిపిస్తుంది.

గుజరాత్

కార్పొరేట్ స్టైల్ లో ఉంటే ఈ రాష్ట్రంలో ఉదయం 9 నుంచి రాత్రి వరకూ పని చేస్తూనే ఉండాలి. ఎంత సాదాసీదాగా ఉంటే అంతగా అక్కడి ప్రజలతో దగ్గర కావొచ్చు. ఉన్నతాధికారులమన్న అహంకారం అస్సలు వద్దు. పాలనకు కార్పొరేట్ ప్రపంచం చాలా సన్నిహితంగా ఉంటుంది. కిందిస్థాయిలో పని భారం ఎక్కువ. ఉన్నతాధికారులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.

హర్యానా

పని వాతావరణం బాగున్నా.. చెడుగా మాట్లాడితే గౌరవం దెబ్బ తింటుంది. నోరు అదుపులో పెట్టుకొని పని చేయాలి. స్థానిక సంప్రదాయాలు.. విధానాలు నేర్చుకోవటం అవసరం.

పంజాబ్

రాజకీయ జోక్యం ఎక్కువ. పని చేయటానికి బాగున్నా పనులు మాత్రం జరగవు. అదే సమయంలో పని చేయాలన్న ఒత్తిడి ప్రజల నుంచి పెద్దగా రాదు.

పశ్చిమబెంగాల్

ఈ రాష్ట్రంలో పని పద్ధతి ఏమాత్రం బాగోదు. ఉదయం 11.30 గంటలకు ఆపీసులకు వచ్చి సాయంత్రం 4.30 గంటలకే వెళ్లిపోతారు. సీనియర్ ఆఫీసర్ డ్రైవర్ కూడా ఆఫీసుల్లో ఉండరు. ఇక్కడి సర్వీసు అధికారులు.. డ్రైవర్లు.. గన్ మెన్లతో జాగ్రత్తగా మాట్లాడాలి.

ఉత్తరప్రదేశ్

ఈ రాష్ట్రంలో వాతావరణం.. భిన్నత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడకి పనికి ఎందుకు వచ్చామనిపిస్తుంది. ఐఏఎస్ లను రాజులు.. రాణులుగా చూస్తారు. ఫైళ్లు అన్నీ హిందీలో ఉంటాయి. ఇక్కడ పని చేయాలంటే హిందీ రావటం తప్పనిసరి. పదవీ మాయలో పడితే ఇబ్బందులే. మీడియా.. జ్యూడీషియరీతో గొడవలొద్దు.

ఒడిశా

ఇతరులు.. అధికారుల నుంచి ఎలాంటి బహుమానాలు తీసుకున్నా ఇక అయిపోయినట్లే. ఒడియా నేర్చుకుంటే తిరుగు ఉండదు.

ఛత్తీస్ గఢ్.. జార్ఖండ్

ఉన్నతాధికారులుచాలా క్రమశిక్షణతో ఉంటారు. వారితో ఎప్పుడూ టచ్ లో ఉండాలి. సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడి పని చేసి.. అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చూసుకునేలోపే ఏమీ కనిపించదు.

అసోం.. మేఘాలయ

బీహార్..యూపీలో మాదిరే ఈ రాష్ట్రంలో సామాజిక.. రాజకీయ పరిస్థితులు ఉంటాయి. పని చాలా నెమ్మదిగా సాగుతుంటుంది. పెళ్లు అన్నీ అస్సామీలోనే తయారు చేస్తారు. ఆ భాష నేర్చుకుంటేనే ఇక్కడ రాణింపు సాధ్యమవుతుంది. పెద్దల్ని.. సీనియర్ అధికారుల్ని సర్ అనకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఎంత టాలెంట్ ఉన్నా.. ఉన్నతాధికారులతో సఖ్యతగా ఉండకపోతే అంతే.

బీహార్

రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుందని అనుకుంటాం కానీ.. బీహార్ క్యాడర్ మంచిదే. ఐఏఎస్ లకు బీహారీలు మంచి గౌరవం ఇస్తారు. పని వాతావరణం బాగుంటుంది. ఈ రాష్ట్రంలో పాజిటివ్ అటిట్యూడ్ తో పని చేస్తేనే ఫలితం.

రాజస్థాన్

రాష్ట్ర సర్వీసు అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో పారాహుషార్. పని తీరు బాగోకుంటే రాజకీయ జోక్యం ఎక్కువ.
Tags:    

Similar News