బీసీసీఐని ఆదేశించే దమ్ము ఐసీసీకి లేదు

Update: 2017-11-11 10:39 GMT
ప్రపంచ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బలమేంటన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐసీసీ అయినా బీసీసీఐ చెప్పు చేతల్లో ఉండాల్సిందే. బీసీసీఐని కాదని ఐసీసీ ఏం చేయడానికి లేదు. బీసీసీఐలో అంతర్గత సమస్యల వల్ల ఈ మధ్య కొంచెం బలం తగ్గింది కానీ.. ఇంతకుముందు భారత బోర్డు మరింత బలంగా ఉండేది. ఐసీసీని ఆటాడించేది.

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ఐసీసీ మీద విమర్శలు గుప్పించాడు. భారత బోర్డును ఏ విషయంలోనూ ఆదేశించే దమ్ము ఐసీసీకి లేదని అతను విమర్శించాడు. 2008 ముంబయి ఉగ్రవాద దాడుల తర్వాత పాకిస్థాన్ తో భారత్ తొమ్మిదేళ్లుగా ద్వైపాక్షిక సిరీసులు ఆడని సంగతి తెలిసిందే. దీని వల్ల పాకిస్థాన్ బోర్డు వేల కోట్లలో ఆదాయం కోల్పోయింది. ఈ నేపథ్యంలో భారత బోర్డుపై తన అసహనాన్ని ఐసీసీ మీద చూపించాడు వసీం అక్రమ్.

పాకిస్థాన్ తో భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఆడేలా ఆదేశించే సత్తా ఐసీసీకి లేకపోయిందని అక్రమ్ అన్నాడు. భారత్-పాక్ సిరీస్ అంటే ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుందని.. ఇది ఇరు దేశాల ఆటగాళ్లకు కూడా మంచి అవకాశమని.. కానీ రెండు జట్ల మధ్య మ్యాచులు లేకపోవడంతో అందరూ మజా కోల్పోతున్నారని అన్నాడు అక్రమ్. యాషెస్ సిరీస్ ను 20 లక్షల మంది మాత్రమే చూస్తే భారత్-పాక్ ఒక్క మ్యాచ్ ఆడితే వందల కోట్ల మంది ఆసక్తిగా తిలకిస్తారని అక్రమ్ అన్నాడు. క్రీడలను.. రాజకీయాలను వేర్వేరుగా చూడాలని.. రెండు జట్ల మధ్య సిరీస్ లు జరిగేలా చూడాలని వసీం అన్నాడు. కానీ తమతో క్రికెట్ ఆడాలని తాము బీసీసీఐని బలవంతంగా ఒప్పించే పరిస్థితి లేదని వసీం చెప్పాడు.
Tags:    

Similar News