ఐడి కార్డులు ఉంటేనే.. ఆ ఊళ్లలోకి ఎంట్రీ

Update: 2020-08-23 12:10 GMT
ఏపీ రాజధాని అమరావతిగా చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా జగన్ సర్కారు.. మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా గడిచిన 250 రోజులుగా అమరావతి వాసులు ఆందోళనలు చేస్తున్నారు. నిరసనలు నిర్వహిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వికేంద్రీకరణలో భాగంగా.. డెవలప్ మెంట్ ను అన్ని ప్రాంతాలకు సమానంగా పంచాలన్న లక్ష్యంతో జగన్ సర్కారు ఉంది.

అందుకు భిన్నంగా అంతకు ముందు ప్రభుత్వం తమ భూముల్ని తీసుకొని.. అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో.. దాన్నే అమలు చేయాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా లేదన్న సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు అమరావతిని నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించాలా? అన్న విషయం మీద జగన్ సర్కారు మహా పట్టుదలగా ఉంది.

ఇదిలా ఉంటే.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళం విప్పిన పలువురు.. దాదాపుగా ఎనిమిది నెలలకు పైనే ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజకు వారు నిరసనలు చేపట్టి 250 రోజులైంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున నిరసనలు.. ఆందోళనలు నిర్వహించాలని డిసైడ్ చేశారు. దీంతో.. నిఘా వర్గాలతోపాటు.. పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.

గ్రామాల్లోకి ఇతరులు ఎవరు రాకుండా ఉండేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. రాజధాని గ్రామాల్లోకి ఎవరు అడుగు పెట్టాలన్నా..ఐడీ కార్డులు ఉంటే తప్పించి అనుమతించటం లేదు. అంతే కాదు.. ఎక్కడి వాహనాల్ని అక్కడే నిలిపివేయటంతో పాటు.. బారికేడ్లను పెట్టేసి.. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజధాని గ్రామాల్లో పరిస్థితి అయితే.. కాస్తంత ఉద్రిక్తంగా ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.


Tags:    

Similar News