తెలంగాణకు రాహుల్ వస్తుంటేనే ఈ క్వశ్చన్లు గుర్తుకు వస్తాయా కవిత?

Update: 2022-05-06 05:35 GMT
మిగిలిన రోజుల్లో ఏం చేస్తుంటారో కానీ.. ఎవరైనా ప్రముఖుడు తెలంగాణకు వచ్చేస్తున్న వేళ.. అందునా అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న వారు అడుగు పెడుతున్నంతనే టీఆర్ఎస్ ముఖ్య నేతలు మీడియా ముందుకు కానీ సోషల్ మీడియా ముందుకు వచ్చేస్తుంటారు. ఈ సందర్భంగా వారు వినిపించే వాదనలు వింటే నవ్వాగదు.

వేలెత్తి చూపించే వేలు ఒక్కటి ఎదుటి వారిని చూపిస్తే.. నాలుగు వేళ్లు తమవైపే చూపిస్తాయన్న చిన్న నిజాన్ని మర్చిపోతుంటారు. ఇలాంటి వాస్తవాల్ని గుర్తు పెట్టుకోవటం ద్వారా.. తప్పులు చోటు చేసుకోకుండా.. ప్రతి విమర్శలకు అవకాశం ఇవ్వని రీతిలో తమ వాదన ఉండాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు కనిపించదు వారి మాటల్ని విన్నప్పుడు.

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఈ రోజున తెలంగాణకు వస్తున్నారు. రెండు రోజులు ఉండనున్నారు. ఈ రోజు సాయంత్రం వరంగల్ లో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభలో రాహుల్ మాట్లాడనున్నారు. ఈ భారీ బహిరంగ సభతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సభపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. అధికార పార్టీకి గుబులు పుట్టేలా మారిన ఈ సభ వారిని ఎంతలా చికాకు పెడుతుందన్న దానికి నిదర్శనంగా తాజాగా ఎమ్మెల్సీ కవిత ఒక ట్వీట్ చేశారు.

అందులో ఆమె రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. అవేమిటన్నది చూస్తే..

-  గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్ లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి?

-  తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ?

-  దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు?

-  తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు , నిధుల గురించి టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ?

-  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు ?

-  ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఆసరా వంటి పథకాలపై ఆరా తీసి అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండి.

-  సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను స్పూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవడానికి మీకు కూడా తెలంగాణకు స్వాగతం!!

కవిత ట్వీట్ చదివినంతనే నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. ఆమె సంధించిన ఒక్కో ప్రశ్నను నిశితంగా చూసినప్పుడు నిజాలు వాటంత అవి వస్తాయి. ఉదాహరణకు తెలంగాణ అంశాల్ని పార్లమెంటులో ఎన్నిసార్లు మీద పార్టీ ప్రస్తావించిందన్న మాటను చెప్పే బదులు.. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎంపీలు ఎందరు? వారిలో ఎంతమంది ఎన్నిసార్లు మాట్లాడారో లెక్క చెప్పి రాహుల్ ను ప్రశ్నిస్తే బాగుంటుంది. దేశ వ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసినప్పుడు మీరెక్కడ? అని ప్రశ్నించిన కవిత.. వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన వేళలో కవిత ఎక్కడ ఉన్నారు?

ఒకరిని ప్రశ్నించే వేళలో.. తామేం చేశామన్నది ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఒకవేళ చేశామని భావిస్తే దానికి సంబంధించిన అంశాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అంత చేస్తుంది.. ఇంత చేస్తుందన్న మాట ఓకే. మరి.. ముఖ్యమంత్రి డ్రీం ప్రాజెక్టు యాదాద్రి.. ఒక్క గాలి దుమారం వానకు ఇంతలా ఎందుకు జరిగింది? సమర్థ నాయకుడి పాలనలో ఇలా జరగటం దేనికి నిదర్శనం?
Tags:    

Similar News