ఎంప్లాయీస్‌తో పెట్టుకుంటే మ‌డ‌త‌డిపోద్ది.. తెలుసా?

Update: 2022-02-08 04:30 GMT
``ఉద్యోగుల‌తో పెట్టుకుంటే మడ‌త‌డిపోద్ది``- ఈ డైలాగు చాలా ఫేమ‌స్‌. గ‌తంలో వ‌చ్చిన వెంకీ మూవీలో ఉన్న‌ ఈ డైలాగు.. త‌ర్వాత కాలంలో ఇది బాగా ఫేమ‌స్ అయిపోయింది. అయితే.. ఇప్పుడు ఈ మాటే.. ఉద్యోగ వ‌ర్గాల నుంచి బాగా వినిపిస్తోంది. అది బిహార్ అయినా.. బ‌రంపురం(ఒడిసా) అయినా.. ఉద్యోగుల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య తేడా వ‌స్తే అంతే! ఉద్యోగులు త‌లుచుకుంటే.. పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా ప్ర‌భుత్వాలు కుప్ప‌కూలిన ప‌రిస్థితి కూడా మ‌న‌కు తెలిసిందే. అందుకే.. ప్ర‌భుత్వాలు.. ఏ పార్టీవైనా.. ఉద్యోగుల విష‌యంలో ఆచి తూచి అడుగులు వేస్తాయి.

దేశంలోను, రాష్ట్రాల్లోనూ గ‌డిచిన 40 ఏళ్ల రాజ‌కీయ హిస్ట‌రీని ప‌రిశీలిస్తే.. ఉద్యోగుల అండ‌తోనే పార్టీలు అధికారంలోకి వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో ఉద్యోగుల‌తో విభేదించిన ప్ర‌భుత్వాలు.. వారిని రాచి రంపాన పెట్టిన నాయ‌కులు.. ఆక‌స్మిక త‌నిఖీల పేరుతో రాజ‌కీయ మైలేజీ కోసం.. వెంప‌ర్లాడిన నాయ‌కులు.. త‌ర్వాత కాలంలో కుప్ప‌కూలిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త  త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాల‌పై ఉంటుంది. అయితే.. ఉద్యోగులే క‌దా.. ఏం చేస్తారులే.. అనుకునే భావ‌న పెచ్చ‌రిల్ల‌డం తోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ములాయంసింగ్ యాద‌వ్ ప్ర‌భుత్వం గ‌తంలో ఒడిదుడుకులు ఎదుర్కొంది.

ఇక‌, ప‌క్క‌నే ఉన్న ఒడిసాలోనూ న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఇన్నేళ్లుగా అధికారంలో ఉండ‌డానికి ఉద్యోగుల‌తో ఫ్రెండ్లీగా ఉండ‌డ‌మే కార‌ణం. అయితే.. ఇప్పుడు ఉద్యోగులు అంటే.. పూచిక పుల్ల‌ల్లా.. తాము ఆడిస్తే.. ఆడే తోలుబొమ్మ‌ల్లా భావిస్తున్న ప్ర‌భుత్వాలు క‌నిపిస్తున్నాయి. పైకి మాత్రం మాది ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్ర‌భుత్వం అని కామెంట్లు చేస్తున్నారు. తీవ్ర‌స్థాయిలో ప్ర‌చారం కూడా చేస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఉద్యోగుల డిమాండ్ల‌ను పరిష్క‌రించ‌డంలోను.. ప‌రిశీలించ‌డంలోనూ.. అనేక కార‌ణాలు చెబుతున్నారు. వారిని న‌యోనో.. భ‌యానో.. దారికి తెచ్చుకుంటున్నారు. ఉద్యోగుల‌తో మేం మిళిత‌మ‌య్యామ‌ని కామెంట్లు చేస్తున్నారు.

కానీ, ఈ ప‌రిస్థితి మొద‌టికే మొసం చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఉద్యోగులు అంటే.. కేవ‌లం సంఘాల‌కు చైర్మ‌న్‌లు మాత్ర‌మే కాదు. క్షేత్ర‌స్తాయిలో ఉద్యోగులు.. సంతృప్తి చెందితేనే.. ప్ర‌భుత్వంపై వారికి న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. అంతే త‌ప్ప‌.. పైకి ఏవో క‌బుర్లు చెప్పి.. అప్ప‌టికి గండం గ‌డిచింద‌ని సంబర‌ప‌డితే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆ వేడి అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌నే విష‌యాన్ని పాల‌కులు ఎవ‌రైనా, నాయ‌కులు ఎవ‌రైనా.. గుర్తించ‌క‌త‌ప్ప‌దు. ముఖ్యంగా ఉద్యోగులు అంత ఈజీగా ప్ర‌భుత్వానికి లొంగ‌ర‌నే విష‌యాన్ని గుర్తించాలి. వారి ప్ర‌ధాన డిమాండ్ల‌ను సాధించుకునేందుకు అవ‌స‌ర‌మైతే.. ప్ర‌భుత్వాన్ని దింపేందుకు కూడా వారు వెనుకాడ‌రు. సో.. ఈ విష‌యాన్ని ఏ ప్ర‌భుత్వ‌మైనా.. పాల‌కులైనా గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 
Tags:    

Similar News