రుషికొండ మీద అక్రమ తవ్వకాలు నిజమే... ఎంత అన్నదే తేలాలి...?

Update: 2022-11-03 10:30 GMT
విశాఖ అంటే ఇపుడు రుషికొండగా మార్చుకుని చదవాల్సి వస్తోంది. రుషికొండ గురించి జరుగుతున్నంత ప్రచారం కానీ పొలిటికల్ ఫోకస్ కానీ ఇపుడు మరో విషయం మీద లేదనే చెప్పాలి. రుషికొండ మీద అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఏకంగా కొండను గుండు చేసి పారేస్తున్నారు అని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ప్రకృతిపరమైన రక్షణగా పర్యవరణ హితంగా విశాఖలో ఉన్న ఈ కొండను అన్ని నిబంధనలను నీళ్ళొదిలేసి తవ్వడం పట్ల అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ విపక్షాలు ఒక వైపు ఆందోళన చేస్తూంటే మరో వైపు  కోర్టులో కేసులు ఫైల్ అయ్యాయి.

దీని మీద తాజా విచారణ సందర్భంగా హై కోర్టు కీలకమైన నిర్ణయాన్నే వెలువరించింది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అధికారుల బృందాన్ని రుషికొండ మీద ఎంత మేరకు అక్రమంగా తవ్వారు అన్న దాని మీద విచారించి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించాలని కోరింది. దీనికి ముందు జరిగిన విచారణలో కూడా హై కోర్టు ప్రభుత్వ తీరుని తప్పుపట్టించి గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదు కదా అని కూడా ప్రభుత్వ  న్యాయవాదులను హైకోర్టు నిలదీసింది.

ఇదిలా ఉంటే తాజా విచారణ సందర్భంగా పర్యావరణ శాఖ అనుమతుల కంటే అదనంగా కొండను తవ్వినట్లుగా ప్రభుత్వం అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే అది ఎంత అన్నది ఇపుడు పూర్తి వివరాలతో తెలియాల్సి ఉంది. ఆ పని హై కోర్టు ఆదేశించిన మేరకు పర్యావరణ అటవీ శాఖ అధికారులు పూర్తి చేస్తారు. ఇదిలా ఉంటే రుషికొండ మీద గతంలో టూరిజం వారి అతిధి భవనాలు ఉండేవి. వాటిని గత ఏడాది ప్రభుత్వం ఒక్కసారిగా కూల్చివేసింది.

దాంతో అప్పట్లోనే రుషికొండ మీద ఏదో జరుగుతోంది అని విపక్షాలు భావించి ఆందోళన చేపట్టాయి. అయితే నాడు ప్రభుత్వ అధికారులు చెప్పినది ఏంటి అంటే పర్యాటక భవనాలనే అక్కడ పటిష్టంగా నిర్మిస్తామని, ఆధునిక హంగులతో ఫైవ్ స్టార్ హొటెల్స్ ని నిర్మిస్తామని పేర్కొన్నారు. కానీ తరువాత చూస్తే మాత్రం రకరకాలైన ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి ఏంటి అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ని సువిశాలమైన ఆ ప్రాంతంలో నిర్మిస్తున్నారు అని. అంటే రేపటి రోజున పాలనా రాజధాని విశాఖకు షిఫ్ట్ అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ రుషికొండ మీద నిర్మించిన భవనాల నుంచే సాగుతుంది అని చెబుతున్నారు.

అయితే ఈ భవనాలకు మొత్తానికి మొత్తం కొండను అక్రమంగా తవ్వడం ఎందుకు అన్న ప్రశ్న వస్తోంది. ఎంతటి భవనాలు అయినా ఒక పరిధి పరిమితిలో నిర్మించాలి కదా. అందునా పర్యావరణ విభాగం ఇచ్చిన నిబంధలను కచ్చితంగా  అమలు చేయాలి కదా అన్నది వాదనగా ఉంది. ఇక రుషికొండ మీద దాదాపుగా ఏడాది నుంచి నిర్మాణాల పేరిట అంతా రహస్యంగానే సాగుతోంది. రాజకీయ నాయకులు ఎవరైనా అక్కడ ఏమి జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి చూసినా ఎవరినీ అధికారులు పోలీసులు అనుమతించడంలేదు.

ఆ మధ్యన విశాఖ వచ్చిన చంద్రబాబుని కానీ సీపీఐ నాయకుడు నారాయణ కానీ బీజేపీ నాయకులను కానీ ఎవరినీ రుషికొండ సమీపానికి కూడా అనుమతించలేదు. దాంతో నిజానికి అక్కడ ఏమి జరుగుతోంది అన్న ఉత్కంఠ బాగా పెరిగిపోతోంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా అక్కడ పద్ధతిగా కట్టడాలు కనుక నిర్మిస్తే ఎందుకు ఈ దాపరికం అన్నది కూడా చర్చకు వస్తోంది. మొత్తానికి ఇపుడు హై కోర్టు ఆదేశాల్తో అక్కడ కనుక సమగ్ర విచారణ జరిగితే కచ్చితంగా వాస్తవాలు బయటపడతాయి అని అంటున్నారు.

ఇదిలా ఉంటే విశాఖకు తలమానికంగా ఉన్న రుషికొండ పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది. 2014లో హుదూద్ వంటి భయంకరమైన తుపాను వచ్చినా విశాఖ సిటీ  సేఫ్ గా బయటపడింది అంటే ఈ కొండలే రక్షణ కవచాలుగా నిలిచాయి అన్నదే అంతా చెబుతారు. అలాంటి రుషికొండ గురించి అక్కడ అక్రమ తవ్వకాల గురించి వాస్తవాలు బయటకు రావాలి అని అంతా కోరుకుంటున్నారు. ఒక విధంగా హై కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ప్రభుత్వానికి షాక్ గా మారితే విపక్షాల వాదనకు బలాన్ని ఇచ్చేలా ఉన్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News