ఆ 11 ఆత్మ‌హ‌త్య‌ల‌కు అత‌డే కార‌ణ‌మా?

Update: 2018-07-03 11:47 GMT
ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో భాటియా కుటుంబసభ్యుల సామూహిక ఆత్మహత్యల మిస్ట‌రీ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం వెనుక గ‌ల కార‌ణాలేమిట‌న్న‌ది పోలీసుల‌కు అంతుచిక్క‌డం లేదు. తాంత్రిక పూజ‌ల‌కు ఆక‌ర్షితులైన ఆ కుటుంబ స‌భ్యులు ....మోక్షం పొందడం కోస‌మే ఆత్మహత్యకు పాల్పడ్డార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఇంట్లోని ఓ గోడ నుంచి బ‌య‌టి వైపుకు 11 పైపులు అమ‌ర్చి ఉండ‌డం, అందులో 7 మ‌హిళ‌ల‌ను - 4 పురుషుల‌ను సూచించేలా ఉండ‌డం ఈ అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయి. అయితే, ఆ ఇంట్లోని ఓ యువ‌తి పెళ్లి వ‌చ్చే నెల జ‌ర‌గ‌నుంద‌ని, ఈ స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకుంటార‌ని బంధువులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. క్షుద్ర  - తాంత్రిక పూజ‌ల‌ను భాటియా కుటుంబం విశ్వ‌సించ‌ద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఆత్మహ‌త్య‌ల వెనుక ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి భ్రమలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఇంట్లోని ఓ వ్య‌క్తి రాసుకున్న డైరీలోని విష‌యాల‌ను బ‌ట్టి పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వ్య‌క్తి సూచ‌నల ప్ర‌కారమే మిగ‌తా 10 మంది ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. అస‌లు వారంతా తాము చ‌నిపోతామ‌ని అనుకోలేద‌ని - త‌మ‌ను దేవుడు ర‌క్షిస్తాడ‌ని భావించార‌ని అంచ‌నాకు వ‌చ్చారు. అంతేకాకుండా, నారాయ‌ణ్ దేవి కూడా ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని - ఆ త‌ర్వాత ఆమెను కుటుంబ స‌భ్యులు కింద‌కు దించార‌ని పోలీసులు ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు.

ఈ సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల వెనుక‌ నారాయణ్‌ దేవి చిన్న కుమారుడు లలిత్ భాటియా(45) ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ల‌లిత్ భాటియాకు కొంతకాలం క్రితం ప్రమాదవశాత్తూ మాట పడిపోయింది. అయితే, కొద్ది రోజుల నుంచి అత‌డు కొద్దికొద్దిగా మాట్లాడుతున్నాడు. తాజాగా, లలిత్‌ భాటియా రాసిన ఓ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో విస్తుపోయే విష‌యాల‌ను పోలీసులు గుర్తించారు. పదేళ్ల క్రితం చనిపోయిన త‌న‌ తండ్రి నారాయ‌ణ్ దాస్ త‌న క‌ల‌లోకి వ‌స్తున్నాడ‌ని - ఆయ‌న త‌మ కుటుంబానికి మోక్షం క‌లిగిస్తాడ‌ని ల‌లిత్ భావించాడ‌ని ఆ డైరీలోని రాత‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంద‌ని పోలీసులు చెప్పారు. 2015 నుంచి త‌న తండ్రి ఆదేశాల‌ను లలిత్‌ ఆ డైరీలో రాసుకుంటున్నాడ‌ని , జూన్‌ 25న చివ‌రిసారిగా రాశాడ‌ని తెలిపారు. ఈ ఆత్మహత్యలన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని డేట్ ఫిక్స్ చేసుకున్న‌ట్లు గుర్తించారు. ‘నేను ఈ రోజు లేదా రేపు వ‌స్తాను....ఒక‌వేళ రాకుంటే...త‌ర్వాత వ‌స్తాను....లలిత్ గురించి కంగారుపడకండి. నేను వ‌చ్చిన‌పుడు అత‌డు కొద్దిగా కంగారు ప‌డ‌తాడు`` అని రాసి ఉంద‌ని పోలీసులు తెలిపారు. దీంతో, త‌న తండ్రి త‌మ‌కు మోక్షం ప్ర‌సాదిస్తాడ‌ని - తాము చ‌నిపోమ‌ని - దేవుడు త‌మ‌ను కాపాడ‌తాడ‌ని ....లలిత్‌ భ్రమప‌డ‌డం వల్లే ఈ ఆత్మహత్యలు జరిగినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News