ఐటీ పట్టుకున్న మొత్తం సొమ్ము ఇదేనంట!

Update: 2016-12-21 05:07 GMT
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న నల్లబాబులు చాలా ఇబ్బందులు పడతారని, దాదాపు మొత్తం నల్లధనం వెలుగులోకి వస్తుందని అంతా భావించారు. అయితే ఆ దాఖలాలేవీ కనిపించడంలేదనేది అందరికీ తెలిసిన విషయమే! అయితే దీంతో తేరుకున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు... కేవలం నోట్ల రద్దు వల్లే నల్లధనం మొత్తం పోదని, ఆ ప్రక్రియలో ఇది ఒక అడుగుమాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా సామాన్యులు మాత్రమే ఇబ్బంది పడ్డారు తప్ప పెద్ద పెద్ద వారంతా వారి పని వారు గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేశారనేది తెలిసిన విషయమే!! అయితే అలా మార్చుకున్న వారిలో వెలుగులోకి రాని నల్లబాబుల సంగతి కాసేపు పక్కనపెడితే... వెలుగులోకి వచ్చిన తెలుగు రాష్ట్రాలలోని మొత్తం సొమ్ము లెక్కలు వెలుగులోకి వచ్చాయి.

పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్‌ 8 నుంచి ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశలలో రూ.280 కోట్లను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ రీజియన్ ఆదాయ పన్ను చీఫ్‌ కమిషనర్‌ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ 8 వరకు అంటే నోట్ల రద్దు ముందువరకూ 18 సోదాల్లో రూ.780 కోట్లను స్వాధీనం చేసుకోగా... నవంబరు 8 నుంచి నేటివరకూ రూ. 280 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం రూ.1060 కోట్లు సీజ్‌ చేశారన్నమాట.

ఇదే క్రమంలో దేశంలోని పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా నల్లకుబేరులపై డిసెంబర్‌ 19 వరకు నిర్వహించిన దాడుల్లో ఆదాయపు పన్ను శాఖ రూ. 3,185 కోట్ల అప్రకటిత నగదును వెలికితీసింది. ఇవన్నీ రద్దయిన పాతనోట్లు కాగా. ఇవి కాకుండా మరో రూ. 86 కోట్ల విలువైన కొత్త నోట్లను సీజ్‌ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News