ఆడిటర్ల దగ్గరకు పరుగులు తీస్తున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు

Update: 2019-04-28 05:55 GMT
రాజకీయ నేతలపై కన్నేసిన ఆదాయ పన్ను శాఖ తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ నూ తన లిస్టులో చేర్చింది. అయితే, చాలామంది మిగతా నేతల ఇళ్లపై రైడ్ చేసినట్లుగా కాకుండా కేసీఆర్‌ కు నోటీసులు జారీ చేసింది. 2014లో - 2018లో ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు - అప్పుల విషయంలో తేడాలు ఉండటంతో ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. 2014 నుంచి 18 వరకు అయిదేళ్ల కాలానికి సంబంధించిన ఐటీ రిటర్న్ సు తమకు ఇవ్వాలని సూచించింది. మరోవైపు ఈ నోటీసులు ఒక్క కేసీఆర్‌ కే కాదు.. లెక్కల్లో తేడాలు చూపిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలందరికీ నోటీసులు జారీ అయ్యాయి. లెక్కల్లో తేడాలుంటే - అందుకు గల కారణాలను ఆధారాలతో సహా వివరించాలని ఈ నోటీసుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలంతా ఆడిటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు.
   
ముఖ్యంగా రెండు అఫిడవిట్లలో భారీ తేడాను చూపించిన ఎమ్మెల్యేలు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారట. ఇక గత ఐదేళ్ల కాలంలో భారీగా ఆస్తులు పెరిగిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల వివరాలను చూస్తే - 2014లో రూ. 48.51 లక్షల ఆస్తులు చూపిన గువ్వల బాలరాజు (అచ్చంపేట) గతేడాది రూ. 6.96 కోట్ల ఆస్తిని చూపారు. జోగు రామన్న (ఆదిలాబాద్) ఆస్తులు రూ. 84.56 లక్షల నుంచి రూ. 3.78 కోట్లకు పెరిగినట్టు చూపారు. గొంగిడి సునీత (ఆలేరు) ఆస్తులు రూ. 1.90 కోట్ల నుంచి రూ. 4.85 కోట్లకు పెరిగాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ) ఆస్తులు రూ. 48.17 లక్షల నుంచి రూ. 4.94 కోట్లకు చేరాయి.
   
కేసీఆర్ ఆస్తి 2014లో రూ. 15.16 కోట్లుండగా - 2018 ఎన్నికల అఫిడవిట్ నాటికి అది రూ. 23.55 కోట్లకు చేరింది. హరీశ్ రావు ఆస్తి రూ. 2.96 కోట్ల నుంచి రూ. 11.44 కోట్లకు - కేటీఆర్ ఆస్తి రూ. 7.98 కోట్ల నుంచి రూ. 41.83 కోట్లకు పెరిగింది. వీరితో పాటు కొప్పుల ఈశ్వర్ - ఈటల రాజేందర్ - గంగుల కమలాకర్ - శ్రీనివాసగౌడ్ - ఎర్రబెల్లి దయాకర్ రావు - ధర్మారెడ్డి - మహిపాల్ రెడ్డి - దాస్యం వినయ్ భాస్కర్ - గ్యాదరి కిశోర్ తదితరుల ఆస్తులూ భారీగా పెరిగాయి. అయితే... మొన్నటి ఎన్నికల్లో గెలిచిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే ఇలాంటి నోటీసులు వచ్చాయి. వేరే పార్టీల నేతలకు రాకపోవడంతో టీఆరెస్‌లో కలకలం మొదలైంది.
Tags:    

Similar News