సీరం అగ్ని ప్ర‌మాదంలో పెరుగుతున్న తీవ్ర‌త‌.. వ్యాక్సిన్ సేఫేనా?

Update: 2021-01-21 15:37 GMT
మ‌హారాష్ట్ర‌లోని  'సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)' వ్యాక్సిన్ సెంటర్ ప్రాంగణంలో సంభ‌వించిన‌ ప్ర‌మాదంలో న‌ష్ట‌ తీవ్ర‌త అంత‌కంత‌కూ పెరుగుతోంది. మొద‌ట్లో అంచ‌నావేసిన‌ దానికంటే.. న‌ష్టం  ఎక్కువగానే జ‌రిగిన‌ట్టు తేలుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలైనట్లు అధికారులు గుర్తించారు. ప్ర‌మాదంలో ఇంకా ఎవ‌రైనా చిక్కుకుపోయారా? నష్టతీవ్రత ఎంత? అనేది తెలియాల్సి ఉంది.

ఈ సీరమ్ ఫార్మా ఫ్యాక్ట‌రీ పూణెలోని మంజరీ ప్రాంతంలో ఉంది. నిర్మాణ దశలో ఉన్న సెజ్-‌3 భవనంలోని నాలుగు, ఐదు అంతస్తుల్లో ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్టు పుణె మేయర్ మురళీధర్ మోహుల్ మీడియాకు వివరించారు. ల‌భించిన ఐదు మృతదేహాలు  బాగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయ‌ని, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎంతో క‌ష్ట‌ప‌డి వెలికితీశారని చెప్పారు.

అయితే.. ప్ర‌మాదం ఎందుకు జ‌రిగింది? భవనంలో మంట‌లు ఎలా చెలరేగాయి? అనే అంశాల‌పై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. వెల్డింగ్ పనుల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని  ఊహిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.

అయితే..  ఈ ప్రమాదంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయమూ క‌ల‌గ‌లేద‌ని సంస్థ ప్రకటించింది.  ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ఆస్ట్రాజెనెకా  భాగస్వామ్యంతో సీరమ్ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న విష‌యం తెలిసిందే.  ఈ ప్ర‌మాదం జరిగిన ప్రాంతాన్ని 'మంజరీ' అని పిలుస్తారని, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే ప్రదేశానికి ఈ ప్రాంతం కాస్త దూరంలో ఉంటుందని సీరం సీఈవో అధర్ పూనావాల తెలిపారు.

మ‌న దేశంతో పాటు 100కు పైగా పేద దేశాలకు తక్కువ ధరకే కొవిడ్‌ వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో సీరం సంస్థ ప‌నిచేస్తోంది. ఇందులో భాగంగా.. వ్యాక్సిన్‌ అదనపు ఉత్పత్తి కోసమే కొత్తగా మరికొన్ని బిల్డింగ్ ల‌ను నిర్మిస్తోంది. దాదాపుగా పూర్తికావ‌చ్చిన ఈ భ‌వ‌నంలోనే అగ్నిప్రమాదం జరిగి, ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌రం. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక‌, న‌ష్టం తీవ్ర‌త తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News