కిస్తీలు కట్టకుంటే కొట్టారు..మరి మాల్యాని ఏం చేయాలి?

Update: 2016-03-10 15:25 GMT
బ్యాంకులు ఎంత దారుణంగా వ్యవహరిస్తాయన్న దానికి తాజా ఉదాహరణే పెద్ద నిదర్శనం. అక్షరాల 9000 కోట్ల రూపాయిల్ని ఎగ్గొట్టి దర్జాగా దేశం నుంచి జంప్ అయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఏదో చేసేయటం కాదు.. అసలేం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న పరిస్థితి. అన్నేసి వేల కోట్లు ఏ లెక్కన అప్పు ఇచ్చారో కూడా బ్యాంకులు చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఒక పేద రైతు పంటలు సరిగా పండక.. కేవలం రెండంటే రెండు కిస్తీలు (వాయిదాలు) కట్టనందుకు చావ బాదిన వైనం తమిళనాడులో చోటు చేసుకుంది.

బ్యాంకర్లు ఫిర్యాదు చేశారంటూ పోలీసులు వచ్చి సదరు రైతును తీసుకెళ్లి కొట్టిన వైనంపై.. ఆ రైతు భార్య అడిగిన ప్రశ్న పోలీసుల నోట మాట రాకుండా చేసింది. తన భర్తను ఇంత దారుణంగా కొడుతున్న పోలీసులు.. అన్నేసి వేల కోట్ల రూపాయిలు చెల్లించకుండా వెళ్లిపోయిన మాల్యాను ఏం చేస్తారంటూ వేసిన ప్రశ్న వేసిన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

తంజావూరుకు చెందిన బాలన్ అనే రైతు పొలం పనుల కోసం ట్రాక్టర్ కొనేందుకు 2011లో బ్యాంకు నుంచి రూ.3.4లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇందులో సగానికిపైనే మొత్తాన్ని ఇప్పటికే చెల్లించాడు. ఇంకా రూ.1.3లక్షలు తీర్చాల్సి ఉంది. పంటలు సరిగా పండకపోవటం కారణంగా గత రెండు నెలలుగా అతడు కట్టాల్సిన వాయిదాలు కట్టలేదు.

ఈ నేపథ్యంలో పోలీసులకు బ్యాంకు ఫిర్యాదు చేయటం.. వారొచ్చి బాలన్ ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకోవటమే కాదు.. అతన్ని తీవ్రంగా కొట్టారు. రైతును దారుణంగా కొట్టిన వైనం అక్కడి ప్రత్యక్షసాక్ష్యులు వీడియో తీశారు.  ఇదిలా ఉంటే.. ఈ విషయం తెలిసిన మీడియా అక్కడకు వెళ్లటం.. వారిని చూసిన బాలన్ సతీమణి ఆగ్రహంతో..రెండు వాయిదాలు చెల్లించలేదని తన భర్తను దారుణంగా కొట్టారని.. మరి వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన మాల్యాను ఏం చేస్తారంటూ ఆగ్రహంతో అడిగింది. ఆమె ప్రశ్న ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు.. ఈ ఉదంతంపై స్పందించిన పోలీసులు.. సదరు ట్రాక్టర్ ను కోర్టు ఆదేశాల మేరకే స్వాధీనం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. కానీ.. కొట్టిన విషయంపై మాత్రం స్పందించకపోవటం గమనార్హం.
Tags:    

Similar News