డిప్యూటీ సీఎం భార్యను టార్గెట్ చేసేందుకు 53 ఫేక్ అకౌంట్లు తెరిచిన మహిళ

Update: 2022-09-15 06:46 GMT
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత.. కొందరు తమ మనసులోని వికారాల్ని బయటపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. వ్యక్తిగత ఎజెండాతో పాటు.. కొందరి ప్రోత్సాహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుకు ప్రముఖులు.. సెలబ్రిటీలు తరచూ ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా అలా వ్యవహరించిన ఒక మహిళను పోలీసులు అరెస్టు చేసి.. ఆరా తీయగా దిమ్మ తిరిగే విషయాలు బయటకు వచ్చాయి.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సతీమణి అమృతా ఫడణవీస్ ను అసభ్యంగా దూషిస్తూ..  ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్న ఒక మహిళపై తాజాగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమెను అరెస్టు చేశారు పోలీసులు.

విచారణలో భాగంగా సదరు మహిళకు సంబంధించిన సమాచారాన్నిసేకరించే క్రమంలో.. అమృతా ఫడణవీస్ పై అసభ్య రాతలు రాసేందుకు సదరు మహిళ ఏకంగా 53 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిందన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

సైబర్ సెల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అసభ్యకరపోస్టులు పెడుతున్న  స్మృతి పాంచాల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆమెకు 13 జీమొయిల్ అకౌంట్లు కూడా ఉన్న విషయాన్ని గుర్తించారు.దీంతో ఆమెపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆమెను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ భార్యను ఇంతలా ఎందుకు టార్గెట్ చేసినట్లు? ఆమెను అంత అసభ్యకరంగా దూషించటం వెనుకున్న కారణం ఏమిటి? అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో తమకు ఇష్టం లేని వారిని.. నచ్చని వారి విషయంలో ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టే కల్చర్ బాగా పెరిగింది. హద్దులు దాటేసే అసభ్య.. అశ్లీల పోస్టులకు చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సో.. పోస్టు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News