బ్యాంకులో డబ్బులేయగానే ఇంకు చుక్క

Update: 2016-11-15 09:51 GMT
పెద్దనోట్లను రద్దు నిర్ణయంతో మొదటి రెండు.. మూడు రోజులు బ్యాంకులు ఫుల్ బిజీగా ఉంటాయన్నది అందరూ ఊహించిందే. ఇదేమంత ఆశ్చర్యం కలగలేదు. కానీ.. ఏడు రోజుల తర్వాత కూడా బ్యాంకుల వద్ద భారీ క్యూలు దర్శనమివ్వటం.. రోజులు గడుస్తున్నకొద్దీ బ్యాంకుల వద్ద క్యూ లైన్ల బారులు మరింత పెద్దవి కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రానికైతే ఈ పరిణామం షాకింగ్ గా మారింది. ఎందుకిలా జరుగుతోంది? క్యూ లైన్లను కంట్రోల్ చేయటానికి ఏం చేయాలన్నది ఇప్పుడు వారి ముందున్న పెద్ద ప్రశ్నగా మారింది.

బ్యాంకుల వద్ద క్యూ లైన్లు పెరగటానికి కారణం.. బ్యాంకుల వద్దకు వచ్చిన వారే.. పదే పదే రావటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న వాదనను వినిపిస్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్. అందుకే ఈ క్యూలను తగ్గించటానికి వీలుగా కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఒకసారి అకౌంట్లో డబ్బులు వేసుకున్న తర్వాత మళ్లీ రాకుండా ఉండేందుకు వీలుగా.. గతంలో డబ్బు వేసినట్లు తెలియజేసేలా వేలికి ఇంకు చుక్క వేయాలని డిసైడ్ చేసినట్లుగా ఆయన చెబుతున్నారు.

నల్లధనం ఎక్కువగా ఉన్న వారు పెద్ద సంఖ్యలో వ్యక్తుల్ని బ్యాంకుల వద్దకు పంపుతున్నారని.. దీంతో బ్యాంకుల వద్ద రద్దీ పెరిగినట్లుగా ఆయన విశ్లేషిస్తున్నారు. అందుకే.. నల్లధనం ఉన్న వ్యక్తుల ఆటలు కట్టడి చేయటానికి కేంద్రం ఇంకు చుక్కతో చెక్ చెప్పాలని భావిస్తోంది. ఇక.. జన్ ధన్ యోజన అకౌంట్లో రూ.50వేలు వరకూ మాత్రమే డిపాజిట్ చేయొచ్చని ఆయన చెబుతున్నారు. బ్యాంకుల వద్ద జనం ఎక్కువ మంది ఉండటం వల్ల సమయం వృధా అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఆర్ బీఐ వద్ద తగినంత డబ్బు ఉందని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసి.. నగదు కొరత తీర్చనున్నట్లుగా ఆయన చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News