చైనా, ఇటలీ, స్పెయిన్, అమెరికాతో పోల్చుకుంటే భారత్ లో కరోనా తీవ్రత అంతగా లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మనల్ని మెచ్చుకుంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు ఏంటంటే మనం అంతగా కరోనా పరీక్షలు చేయడం లేదు. టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడం వల్లే తక్కువ కేసులు వెలుగు చూస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. దీనికి ఉదాహరణలు కూడా కొందరు చూపిస్తున్నారు.
భారత దేశంతోపాటు దక్షిణాఫ్రికా దేశం కూడా ఒకేసారి లాక్ డౌన్ విధించాయి. అయితే మనకంటే కూడా దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య చాలా తక్కువ. మార్చి 24న భారత్ లో లాక్ డౌన్ విధించారు. సౌతాఫ్రికాలో మార్చి 26న విధించారు. కేసుల సంఖ్య మాత్రం భారీగా తేడా ఉంది.
భారత్ లో కరోనా కేసుల సంఖ్య సోమవారానికి 17615 కేసులు నమోదు కాగా.. 559మంది మరణించారు. అదే సౌతాఫ్రికాలో కేవలం 3158 కేసులు నమోదయ్యాయి. 54మంది మాత్రమే చనిపోయారు. సౌతాఫ్రికాతో పోలిస్తే భారత్ లో కేసులు 6 రెట్లు ఎక్కువ.
అయితే భారీ జనాభా ఉన్న భారత్ ను, తక్కువ జనాభా ఉన్న సౌతాఫ్రికాను ఒకే గాటిన కట్టలేం. పైగా ఆఫ్రికా వాసుల ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది.
అయితే భారత్ కంటే వేగంగా సౌతాఫ్రికా స్పందించి కరోనాను అరికట్టింది. సౌతాఫ్రికాలో జల్లెడ పట్టి మరీ టెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే 114000 టెస్టులు నిర్వహించారు. అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా టెస్టులను చేస్తున్నారు. సౌతాఫ్రికాలో ఒక మిలియన్ జనాభాకు 1934 టెస్టులు చేశారు. భారత్ లో మాత్రం ఒక మిలియన్ జనాభాకు కేవలం 291 టెస్టులు మాత్రమే చేశారు. అందుకే ఇక్కడ ఇంకా చాలా మందికి కరోనా ఉన్నా బయటపడేవరకు తెలియని పరిస్థితి. వారి ద్వారా మరింతగా విస్తరిస్తోంది.
ఇక లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు - దాదాపు 2200 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అధిక ధరలు అమ్మిన వ్యాపారులను జైలుకు పంపారు. సౌతాఫ్రికాలో కఠిన నిబంధనల కారణంగా జనాలు బయటకు రాక కరోనా తగ్గింది. కానీ దేశంలో తబ్లిగీ లాంటి ఘటనలు.. వారిని నియంత్రించకపోవడంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.