మాంద్యం మీద గూగులమ్మను తెగ అడిగేస్తున్నారట!

Update: 2019-09-14 07:10 GMT
మాంద్యం వచ్చిందా? లేదా? అంటే సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. కాకుంటే.. గతంతో పోలిస్తే.. పలు అంశాలకు సంబంధించి వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మాంద్యం ముప్పు ముంచుకొచ్చిందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే బంగారం.. వెండి ధరలు భగ్గుమనటం.. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు తగ్గటం.. వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టటం లాంటి వాటితో పాటు దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

గతంలో రెండెంకలు నమోదు చేసిన ఆర్థిక వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవటం ఇప్పుడు ఆందోళనలకు గురి చేస్తోంది. మాంద్యం వచ్చేసిందని చెబుతున్నా.. ఇప్పటికి రాలేదని.. అలాంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

మాంద్యం మాటలతో హడలిపోతున్న వారిలో భారతీయులే కాదు.. ఇతర దేశస్తులు సైతం ఎంతో ఉత్కంటతో వెతికేస్తున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. ఇటీవల కాలంలో భారత ఆర్థిక మందగమనం.. ఇండియా ఎకానమీ స్లోడౌన్.. లాంటి పదాలతో గూగుల్ లో వెతకటం ఈ మధ్యన ఎక్కువైనట్లు గుర్తించారు. ఈ వెతుకులాట ఒక్క ఇండియాలోనే కాదు.. పలు దేశాల్లోనూ భారత్ ఆర్థిక పరిస్థితి మీద సెర్చ్ చేయటం కనిపిస్తోందని చెబుతున్నారు.

భారత ఆర్థిక మాంద్యంపై దేశంతో పాటు సింగపూర్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. కెనడా.. బ్రిటన్.. అమెరికా నుంచి ఇదే విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి పలువురిలో వ్యక్తం కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. మరో ఆసక్తికర విషయం ఏమంటే.. ఆర్థిక మాంద్యం మీద వెతుకుతున్న వారిలో గోవా ప్రజలు ఎక్కువని చెబుతున్నారు. గోవా తర్వాత జార్ఖండ్.. ఢిల్లీ.. హిమాచల్ ప్రదేశ్.. మహారాష్ట్ర రాష్ట్రాల్లోని వారు ఎక్కువగా గూగులమ్మను ఆశ్రయించి.. తమ సందేహాలకు సమాధానాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. వెతుకులాట బాగానే ఉంది సరే.. మాంద్యం మాటేమిటి? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారిందని చెబుతున్నారు.
Tags:    

Similar News