మోదీ మంచి స్నేహితుడే కానీ.. పెద్ద వసూల్ రాజా- ట్రంప్

Update: 2019-04-07 12:58 GMT
భారతదేశం పన్నులు అధికంగా విధిస్తోందంటూ ఇప్పటికే విమర్శలు చేసిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి ఈ విషయంలో భారత్‌పై విరుచుకుపడ్డారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై భారత్ 100 శాతానికి పైగా పన్ను విధిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ఏమాత్రం పన్నులు విధించడం లేదని చెప్పారు.

ఇది కచ్చితంగా మూర్ఖత్వమేనని.. దీనిపై దృష్టి పెట్టాలని ఆయన తన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఇండియాను టారిఫ్ కింగ్ అన్నారు. ‘‘ఇండియా చాలా వస్తువులపై 100 శాతానికిపైగా పన్ను విధిస్తోంది. గొప్పదేశం.. గొప్ప స్నేహితుడు.. గొప్ప ప్రధాని మోదీ’’ అంటూ వెటకారమాడారు. భారత్ ఇలా భారీగా పన్నులు బాదుతున్నా అమెరికా కొంచెం కూడా సుంకాలు విధించకపోవడంపై తమ దేశంలో సెనేటర్లు మండిపడుతున్నారు. తిరిగి పన్నులు వేయాలంటూ తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

భారత్ చాలా మూర్ఖంగా మాతో వ్యాపారం చేస్తోంది. పక్షపాత విధానాలు అనుసరిస్తోంది. దీనిపై దృష్టిపెట్టి ఏం చేయాలో తేల్చండి అని తన అధికారులను ఆదేశించారు. ఇలాంటి వ్యాపారాల కారణంగా అమెరికా ఎన్నో ఏళ్లుగా ఎంతో నష్టపోతోందని.. ఇప్పుడు ఏడాదికి 800 బిలియన్ డాలర్లు ఇలాంటి విధానాల వల్ల నష్టమొస్తోందని ట్రంప్ చెప్పారు. అయితే.. భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నాం కాబట్టి ఏడాదికి 20 బిలియన్ డాలర్ల వరకు నష్టపోవడానికి తాము సిద్ధమని... కానీ, అంతకంటే ఎక్కువ నష్టమొస్తోందని అన్నారు.


Tags:    

Similar News