ఐటీ శాఖ చెప్పే కోటీశ్వరుల లెక్క వింటే షాకే..

Update: 2016-11-03 05:47 GMT
ఐటీ శాఖ వెల్లడించిన వివరాలు చెప్పే ముందు ఒక్క మాట చెప్పాలనుకున్నాం. భారతదేశం లాంటి దేశంలో.. తెలీని లెక్కల గురించి చదివే ముందే.. మనకు తెలిసిన విషయాన్ని లాజిక్ తో ముడేస్తే.. విషయం ఎంత ఫన్నీగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. ఒక చిన్న ఊళ్లో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారో అందరికి తెలిసిందే. మనకు తెలిసి.. మన చుట్టూ కోట్లాది ఆదాయం వచ్చే వాళ్ల లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా వదిలేసినా.. దేశంలోని రాజకీయ నాయకులు.. సినీ పరిశ్రమకు చెందిన వారు.. కాంట్రాక్టర్లు.. వైద్యులు.. ఉన్నత స్థానాల్లో కొలువు తీరిన వారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాలకు చెందిన వారు గుర్తుకు వస్తారు. అలాంటిది ఘనత వహించిన ఐటీ శాఖ మాత్రం..దేశంలోని కోటీశ్వరుల లెక్కను చెప్పింది.

ఆ శాఖ చెప్పిన లెక్క వింటే షాక్ తగలాల్సిందే. భారతదేశం పేద దేశం అన్న మాటకు తగ్గట్లే.. ఐటీ శాఖ వెల్లడించిన వివరాలు ఉండటం గమనార్హం. భారతదేశం పేదదే కానీ..భారతీయులు కాదన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడా విషయాన్ని కాసేపు పక్కన పెట్టి.. ఆదాయానికి సంబంధించి ఐటీ శాఖ వెల్లడించిన వివరాలు చూస్తే..వార్షిక స్థూల ఆదాయం రూ. కోటి (నెలకు రూ.8.3లక్షలు) నుంచి రూ.5కోట్లు (నెలకు రూ.41.66 లక్షలు) సంపాదన ఉన్న వారు దేశ వ్యాప్తంగా ఉన్నది 45,027 మందిగా తేల్చారు. ఇక.. రూ.50 లక్షల నుంచి రూ. కోటి వరకూ వార్షికాదాయం ఉన్న వారు 98,815గా తేల్చారు. వార్షికాదాయం రూ.5 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నవారు కేవలం 3వేల మంది మాత్రమేనని తేల్చారు.

గడిచిన కొన్నేళ్లలో భారతీయుల ఆదాయం భారీగా పెరిగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతీయుల ఆదాయం భారీగా పెరగనున్నట్లుగా అంచనా వేస్తున్నారు. దేశంలో కోటీశ్వరుల సంఖ్య‌ 15 నుంచి 20 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐటీ శాఖ గణాంకాల ప్రకారం జీతాల ద్వారా ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి సంపాదిస్తున్న వారు 54,921గా తేల్చారు. కోటి రూపాయిలకు పైగా సంపాదిస్తున్నవారి సంఖ్య 24,942 కాగా.. దేశంలో రూ.5 కోట్లనుంచి రూ.10 కోట్ల వరకూ జీతంగా అందుకునే వారు 928 అయితే.. రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్లు ఆర్జిస్తున్న వారు కేవలం 232 మంది మాత్రమేనని చెబుతున్నారు. ఇక.. ఏడాదికి రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ ఆర్జిస్తున్న వారి సంఖ్య 32 మంది మాత్రమేనని తేలింది. ఇదిలా ఉంటే.. రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం ఉన్న వారు పది మంది మాత్రమే ఉండగా.. ఏడాదికి రూ.100 కోట్ల సంపాదన ఉన్న వారు మాత్రం ఇద్దరంటే ఇద్దరు మాత్రమే ఉన్నట్లుగా ఐటీ శాఖ వెల్లడించింది. ఈ లెక్క అంతా విన్నాక.. మీ వరకూ మీకేమనిపించింది..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News