కోడి పితామ‌హులం మ‌న‌మేన‌ట‌!

Update: 2018-07-12 08:08 GMT
కొన్ని విష‌యాలు భ‌లే గ‌మ్ముత్తుగా బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. ఈ రోజున చికెన్ వాడ‌ని దేశ‌మంటూ క‌నిపించ‌దు. నాన్ వెజ్ అన్నంత‌నే కోడి గుర్తుకు వ‌స్తుంది. గుడ్డుతో మొద‌లెట్టి.. స‌మ‌స్త జీవాల్లో ఆహారంగా ప‌నికి వ‌చ్చే దేన్ని వ‌ద‌ల‌కుండా న‌మిలి మింగేసే మ‌నిషి.. నాన్ వెజ్ అన్నంత‌నే తొలుత గుర్తుకు వ‌చ్చేది కోడే. మ‌రి.. అలాంటి కోడిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఎవ‌రిది? అన్న క్వ‌శ్చ‌న్ పై తాజాగా ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింది.

ప్ర‌పంచంలోని కోళ్ల‌కు పితామ‌హుడైన కోడి ఎవ‌రిది? అన్న విష‌యంపై చ‌రిత్ర‌ను ప్రొక్లెయిన్ల‌తో త‌వ్వి తీస్తే..పాత విష‌యం స‌రికొత్త‌గా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌పంచానికి అయుర్వేదం.. యోగా.. వేద విజ్ఞానంతో పాటు చద‌రంగాన్ని.. అన్నింటికి మించి సున్నాను ఇచ్చిన వేద‌భూమి.. కోడిని ఆహారంగా ఇచ్చిన వైనాన్ని తాజాగా గుర్తించారు. ప్ర‌పంచం మొత్తానికి కోళ్ల‌కు పితామ‌హుడైన నాటు కోడిని అందించింది భార‌త‌దేశ‌మేన‌ట‌.

నిజ‌మా? అన్న సందేహం అక్క‌ర్లేద‌ని.. దీనిపై ప‌రిశోధ‌న చేసిన వారు సైతం కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి మ‌రి చెబుతున్నారు. క్రీ.పూ. 2500 నుంచి క్రీ.పూ.2100 మ‌ధ్య సింధు నాగ‌రిక‌త కాలం నాటి మొహెంజోదారోలో కొన్ని ఆధారాలు ల‌భించాయి.ఆ రోజుల్లోనే కోడి పందేలు జ‌రిగిన వైనాన్ని గుర్తించారు. పందేల‌కు మాత్ర‌మే కాదు.. పౌష్టికాహారంగానూ గుర్తించారు. ఆయుర్వేదంలోనూ ఉప‌యోగించుకోవ‌టం క‌నిపిస్తుంది.  

నాటు కోడిని భార‌త్ నుంచి మొద‌ట ప‌ర్షియా గ‌డ్డ‌కు చేరింది. ఆ త‌ర్వాత మెస‌ప‌టోమియాల‌కుచేరింది. క్రీ.పూ. 7-8 శ‌తాబ్దాల‌లో గ్రీసుకు విస్త‌రించి.. క్రీ.పూ. 5-6 శతాబ్దాల‌లో రోమ్ లో అడుగు పెట్టింది. త‌ర్వాతి కాలంలో ఈజిప్టు.. చైనా.. ఐరోపా దేశాల‌కు చేరి చివ‌ర‌గా అమెరికాలో అడుగుపెట్టింది.ఈ రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వంద‌ల కోళ్ల జాతుల‌కు పితామ‌హుడైన ఎర్ర‌కోడి మ‌న‌దే. మ‌న కోళ్ల‌తో కార్పొరేట్ వ్యాపారం చేసి.. వంద‌ల కోట్లు కొల్ల‌గొట్టే సిత్ర‌మైన ఆలోచ‌న చేసిన కేఎఫ్ సీ మాత్రం కోడి చివ‌ర‌గా చేరిన అమెరికావోడిది కావ‌టం గ‌మ‌నార్హం. ఏమైనా ప‌క్కింటి సొమ్మును త‌న సొత్తుగా మార్చుకునే స‌త్తా తెల్లోడిదే బాసూ. మిగిలిన సంగ‌తుల‌న్నీ స‌రే.. కోడికి పితామ‌హుల‌మైన మ‌న దేశానికి కోడి రాయ‌ల్టీని ప్ర‌పంచం నుంచి వ‌సూళ్లు చేసే కొత్త ఐడియాలు పాల‌కులు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందంటారు?
Tags:    

Similar News