‘యాపిల్’నే కుదరదు పొమ్మన్న మోడీ సర్కార్

Update: 2016-06-04 13:39 GMT
విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తే వెనుకా ముందు చూసుకోకుండా ఎర్ర తివాచీ పరి.. సాదరంగా స్వాగతం పలికే ప్రభుత్వం తమది కాదన్న విషయాన్ని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారత్ మార్కెట్లో పాగా వేసేందుకు వీలుగా యాపిల్ వేసిన ఎత్తుగడను మోడీ సర్కారు తిప్పి కొట్టటమే కాదు.. ఊహించని భారీ షాక్ ను ఇవ్వటం విశేషం.

భారత్ లో రెండు రకాల వ్యాపారాలు చేయటానికి వీలుగా యాపిల్ దరఖాస్తు పెట్టుకుంది. అందులో ఒకటి.. వాడేసిన యాపిల్ ఫోన్లను భారత్ లోకి తీసుకొచ్చి అమ్మటం ఒకటైతే.. రెండోది.. యాపిల్ స్టోర్ల ఏర్పాటు. ఇందులో మొదటిదైన పాత ఫోన్లను తీసుకొచ్చి అమ్మే దరాఖాస్తును మోడీ సర్కారు కుదరదని తేల్చేయటం విశేషం. వాడేసిన యాపిల్ సెకండ్ హ్యాండ్ ఫోన్లను భారత్ లోకి అనుమతిస్తే మేకిన్ ఇండియా కాన్సెప్ట్ కు దెబ్బ తినే ప్రమాదం ఉన్నందున యాపిల్ ప్రతిపాదనకు నో అని కరాఖండిగా చెప్పేసినట్లుగా తెలుస్తోంది.

ఇక.. యాపిల్ స్టోర్ల ఏర్పాటు విషయం మీద కూడా సదరు కంపెనీకి ఎదురుదెబ్బ తగిలినట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎఫ్ డీఐ రూల్స్ ప్రకారం.. సింగిల్ బ్రాండ్ రీటైల్ లో వందశాతం ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ అనుమతి ఇస్తూనే.. అందులో మూడింట ఒక వంతు వస్తువుల్ని భారత్ లోనే ఉత్పత్తి చేసినవి ఉండాలన్న రూల్  పెట్టటం గమనార్హం. ఈ రూల్ ను యాపిల్ ఒప్పుకొని స్టోర్స్ తెరిస్తే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగటం ఖాయంగా చెప్పొచ్చు. యాపిల్ లాంటి కంపెనీ అడ్డగోలు ఆఫర్లను తీసుకొస్తే టెంప్ట్ అయిపోమన్న విషయాన్ని మోడీ సర్కారు స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.


Tags:    

Similar News