పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుందట !

Update: 2016-09-23 05:12 GMT
ఉరీ ఘటనలో భారత సైనికులు 20 మంది అమరులైన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిన ఈ ఘటన తర్వాత.. పాక్ ను దెబ్బ తీయాలన్న వాదన జోరందుకుంది. పంటికి పన్ను.. కన్నుకు కన్ను అన్న సిద్ధాంతానికి మించి.. పన్నుకు దవడ బయటకొచ్చేలా దెబ్బ తీయాలన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు. ఉరీ ఘటనతో భారత సైన్యం.. వాయుసేన సీరియస్ కావటమే కాదు.. పాక్ కు బుద్ధి చెప్పే రహస్య ఆపరేషన్ ఒకటి పూర్తి చేసినట్లుగా క్వింట్.కామ్ అనే వెబ్ సైట్ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

అధికారికంగా ధ్రువీకరించని ఈ కథనాన్ని చూస్తే.. ఉరీ ఘటన తర్వాత ఆవేశంతో రగిలిపోయిన భారత ఆర్మీ.. ఒక రహస్య ఆపరేషన్ ను చేపట్టినట్లుగా చెబుతున్నారు. ఆర్మీకి చెందిన అత్యున్న పారా మిలిటరీ యూనిట్లు రెండు పాక్ అక్రమిత కశ్మీర్ లోకి వెళ్లి.. 18 నుంచి 20మంది మధ్య ఉగ్రవాదుల్ని హతం చేసినట్లుగా చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఉరీ ఘటన చోటు చేసుకుంటే.. మంగళ.. బుధవారాల్లో తాజా ఆపరేషన్ జరిగినట్లుగా సదరు వెబ్ సైట్ కథనం చెబుతోంది.

పాక్ అక్రమిత కశ్మీర్ కు వెళ్లిన అత్యున్నత బృందం.. తీవ్రవాద శిబిరాలపై దాడులకు పాల్పడినట్లుగా పేర్కొంది. హెలికాఫ్టర్ల ద్వారా ఈ రహస్య ఆపరేషన్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఆర్మీకి చెందిన విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం తమకీ సమాచారం అందినట్లు చెబుతున్నా.. ఆర్మీలోని ఉన్నత స్థాయివర్గాలు.. నిపుణులు మాత్రం ఈ కథనాన్నినమ్మలేమని చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News