ఆరు పర్వతాలు కైవసం.. చైనాకు భారత్ షాక్

Update: 2020-09-20 16:00 GMT
లఢక్ సమీపంలో చైనా సరిహద్దుల్లో భారత ఆర్మీ దెబ్బకొట్టిందని వార్తలు వస్తున్నాయి. భారత్ భూభాగంపైకి చొచ్చుకొస్తున్న చైనాకు భారత ఆర్మీ షాకిచ్చిందని అంటున్నారు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు పర్వతాలను భారత సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు అధికారులు వవెల్లడించారు.

సరిహద్దుల్లో కీలకంగా వ్యవహరించే ఆరు పర్వతప్రాంతాలపై భారత సైనికులు జెండా పాతారని తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద ఏ దేశానికీ చెందని ఆరు పర్వత శిఖరాలను భారత సైన్యం తమ ఆధీనంలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించినట్లు జాతీయ వార్త సంస్థ పేర్కొంది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆర్మీ ఉన్నతాధికారులు దీన్ని ధృవీకరించినట్లు స్పష్టం చేసింది.

ఈ ఆరు పర్వతాలపైనా ఎప్పటి నుంచో చైనా బలగాలు కన్నేసి ఉంచాయని, దీన్ని పసిగట్టిన భారత సైన్యం దూకుడుగా వ్యవహరించినట్లు తెలిపింది. వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని తేల్చి చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న మగర్ హిల్, గురుంగ్ హిల్, రెచెన్ లా, రెజంగ్ లా, మొఖ్పారిలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ వార్తా సంస్థ తన కథనంలో ప్రచురించింది.

 ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చైనా బలగాల ప్రతిఘటనల మధ్య ఈ ఆరు పర్వత పంక్తులు భారత సైనికుల ఆధీనంలోకి వచ్చినట్టయిందని తెలిపింది. ఈ ఆరు పర్వతాలు భారత భూభాగంపైనే ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు.  
 
 ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పటికీ.. దాన్ని తిప్పి కొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని, క్లిష్ట వాతావరణంలోనూ జవాన్లు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని ఆర్మీ అధికారులు వెల్లడించినట్లు ఆ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది.

    

Tags:    

Similar News