ఐఎస్ ఉగ్రవాదులకు ఇండియా నుంచి డ్రగ్స్

Update: 2017-05-11 11:06 GMT
భార‌త ప‌రువు ప్ర‌శ్నార్థ‌కం అయే వార్త వెలుగులోకి వ‌చ్చింది. రాక్ష‌స మూక అయిన ఐసిస్‌కు భార‌త్ నుంచి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా అవుతున్న‌ట్లు తేలింది. లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదులకు అమ్మేందుకు ఉద్దేశించిన నల్లమందు తరహా ట్రామడోల్ మాత్రలను తరలిస్తున్న నౌకను ఇటలీ అధికారులు పట్టుకున్నారు. ఉగ్రవాదులకు పట్టుదల, ఓపికను పెంచేందుకు వీటిని సమకూరుస్తారు. మాదకద్రవ్యం కొకైన్‌కు చవకరకం ప్రత్యామ్నాయంగా కూడా వీటికి గుర్తింపు ఉంది. పశ్చిమాసియా 7.5 కోట్ల అమెరికా డాలర్ల విలువ చేసే (భారతీయ కరెన్సీలో రూ.510 కోట్లు) 3.7 కోట్ల ట్రామడోల్ మాత్రలు నౌకలో ఉన్నట్టు గుర్తించారు. గెనోవాలో మూడు కంటేనర్లలో మాత్రలను ప్యాక్ చేసి.. పైన బ్లాంకెట్లు, షాంపూ అని లేబుల్ అంటించారు.

లిబియాలోని మిస్రాతా, టోబ్రుక్ వెళ్లే సరకుల ఓడల్లోకి ఎక్కిస్తుండగా అధికారులు అనుమానం వచ్చి పట్టుకున్నారని లండన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. నొప్పి నివారణకు ఉపయోగించే ట్రామడోల్ మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించే డ్రగ్‌గా కూడా పనిచేస్తుంది. ఉగ్రవాదులకు ఉత్తేజం కలిగించి పోరాటానికి ఉసిగొల్పే లక్షణాలు దీనికి ఉంటాయని బీబీసీ పేర్కొంది. మాత్రలను అధికరేటుకు అమ్మి డబ్బు సంపాదించేందుకు లేదా నేరుగా ఉగ్రవాదులకు సరఫరా చేసేందుకు ఈ సరుకును ఉద్దేశించి ఉంటారని ఇటాలియన్ పోలీసులు అంటున్నారు. నైజీరియాలో బోకోహరామ్ ఉగ్రవాదులు చిన్నారులకు కర్జూరంలో ట్రామడోల్ మాత్రలను నింపి తినిపించి తుపాకులిచ్చి దాడులకు పంపుతారు. ఉగ్రవాదుల ఆకలి, అలసట, భయం పోగొట్టేందుకు ఐఎస్ కాప్టగాన్ మాత్రలను ఎప్పటినుంచో ఉపయోగిస్తుంది. జెనోవాలో పట్టుబడ్డ మాత్రలు ఇండియా నుంచి వచ్చినట్టు ఇటాలియన్ అధికారులు నిర్ధారించారు. రాయల్ ఇంటర్నేషనల్ అనే భారతీయ కంపెనీ వాటిని తయారు చేసినట్టు చెప్తున్నారు. పంజాబ్‌కు చెందిన ఆ కంపెనీ ఇటలీలో డ్రగ్స్ పట్టివేతపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది.

కాగా, ఈ సంస్థ‌ దుబాయ్‌లోని దిగుమతిదారుకు సంస్థ 2.5లక్షల డాలర్లకు ట్రామడోల్ మాత్రలను విక్రయించింది. భారత్ నుంచి శ్రీలంకకు వెళ్లిన తర్వాత సరుకు జాడ తెలియకుండా పోయింది. ట్రామడోల్ మాత్ర లిబియాలో 2 డాలర్లకు అమ్ముడవుతుందని ఇటాలియన్ దర్యాప్తు అధికారి తెలిపారు. గత ఏడాది గ్రీకు రేవుపట్టణం పైరేయస్‌లో 2.6కోట్ల ట్రామడోల్ మాత్రలు పట్టుబడ్డాయి. అవీ భారత్‌లో తయారైనవే కావడం గమనార్హం!
Tags:    

Similar News