ఓపెనింగ్ ల కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌!

Update: 2018-09-24 05:10 GMT
స‌మాచార హ‌క్కు చ‌ట్టం పుణ్య‌మా అని ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2014-17 మ‌ధ్య జ‌రిగిన మూడేళ్ల కాలంలో రైల్వే శాఖ‌కు సంబంధించిన ఒక విష‌యం వెల్ల‌డైంది. రైల్వేల ప్రారంభోత్స‌వాల కోసం కేంద్రం ఎంత ఖ‌ర్చు చేసింద‌న్న వివ‌రాల్ని రైల్వేశాఖ వెల్ల‌డించింది.

ఒక స‌మాచార‌హ‌క్కు కార్య‌క‌ర్త సంధించిన ప్ర‌శ్న‌కు రైల్వేలు వివ‌రాలు బ‌య‌ట పెట్టాయి. మూడేళ్ల వ్య‌వ‌ధిలో రైల్వేల‌కు సంబంధించిన ప్రారంభోత్స‌వాల కోసం కేంద్రం రూ.13.46 కోట్లు ఖర్చు చేసిన‌ట్లుగా వెల్ల‌డైంది. మొత్తం 166 కార్య‌క్ర‌మాల కోసం ఈ స్థాయిలో ఖ‌ర్చు అయిన‌ట్లు పేర్కొన్నారు.

వీడియో కాన్ఫ‌రెన్స్ ల ద్వారా ప్రారంభోత్స‌వాలు జ‌రిగాయ‌ని..ఈ ప్రారంభోత్స‌వాల‌కు వీలుగా బ్రాడ్ బ్యాండ్ క‌నెక్ష‌న్లు.. ఎల్ఈడీ స్క్రీన్లు.. సౌండ్ సిస్ట‌మ్.. పూలు.. క‌ర్టెన్స్.. వేదిక‌లు త‌దిత‌రాల కోసం ఈ డ‌బ్బును వినియోగించిన వైనాన్ని వెల్ల‌డించారు. ఈ ప్రారంభోత్స‌వాల ఖాతాలో కొత్త రైళ్ల‌తో పాటు.. రైల్వేస్టేష‌న్ల‌లో ఎస్క‌లేట‌ర్లు.. బ్రిడ్జిలు.. వెయిటింగ్ హాల్స్‌.. వీఐపీ లాంజ్ లు.. మ‌రుగుదొడ్లు కూడా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

సురేశ్ ప్ర‌భు రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు. ప్రారంభోత్స‌వాల పేరుతో కోట్లాది రూపాయిల ప్ర‌జాధ‌నాన్ని భారీగా వృధా చేస్తున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు వినిపిస్తుండ‌గా.. మూడేళ్ల వ్య‌వ‌ధిలో ప్ర‌జ‌ల సౌక‌ర్యాల కోసం కోట్ల రూపాయిల ఖ‌ర్చుతో నిర్మించిన వాటి కోసం ఈ మాత్రం ఖ‌ర్చు చేయ‌టం త‌ప్పేం కాదంటూ వెస్ట్  రైల్వేజోన్ కు చెందిన అధికారి ఒక‌రు వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. ఏమైనా మూడేళ్ల వ్య‌వ‌ధిలో 13.46 కోట్ల ఖ‌ర్చు.. అది కూడా కేవ‌లం ఓపెనింగ్స్ కు మాత్ర‌మే కావ‌టం కూసింత ఎక్కువేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News