సెలక్టర్లు కెప్టెన్ భార్యకు టీ ఇచ్చారా?

Update: 2019-11-01 02:11 GMT
ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో మూడేళ్లు గా పని చేస్తున్న భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీ మీద జనాలకు మంచి అభిప్రాయమే ఉంది. ఈ మూడేళ్లలో ఎందరో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చింది ఈ కమిటీ. కాకపోతే ఈ కమిటీ కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిల ఆదేశాల మేరకే పని చేస్తోందన్న విమర్శలూ లేకపోలేదు. కెప్టెన్, కోచ్‌ మాటల్ని జవదాటి వీళ్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోరనే విమర్శలు అప్పుడప్పడూ వస్తుంటాయి. ఇదే ఆరోపణలతో మాజీ ఆటగాడు ఫరూక్ ఇంజినీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేవలం సెలక్టర్లను విమర్శించడంతో సరిపెట్టకుండా కెప్టెన్ విరాట్ భార్య అనుష్కను కూడా తన ఆరోపణల్లో భాగం చేయడం.. ప్రపంచకప్ సందర్భంగా సెలక్టర్లు అనుష్కకు టీ ఇస్తూ కనిపించారని వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతోంది.

ఎమ్మెస్కే బృందాన్ని ఒక ‘మిక్కీమౌజ్‌ సెలక్షన్‌ కమిటీ’గా ఫరూఖ్‌ ఇంజినీర్‌ అభివర్ణించాడు. అందులోని సభ్యులెవరికీ సరైన అర్హతలే లేవని.. జట్టు ఎంపిక, సెలక్టర్లపై కెప్టెన్ కోహ్లి ప్రభావం ఎక్కువగా ఉంటోందని అన్నాడు ఫరూక్. సెలక్టర్లందరూ కలిపి కనీసం 12 టెస్టులైనా ఆడలేదని.. ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్‌కు వచ్చిన సెలక్టర్లలో ఒకరిని తాను గుర్తుపట్టలేకపోయా. టీమిండియా బ్లేజర్ ధరించడంతో ఎవరని ప్రశ్నించానని. తానో సెలక్టరని అతను చెప్పాడని ఫరూక్ వ్యాఖ్యానించాాడు. వాళ్లంతా చేసింది అక్కడ అనుష్క శర్మకు టీ కప్పులు అందించడం అని ఆరోపించిన ఫరూక్.. దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ స్థాయి వ్యక్తులు సెలక్షన్‌ కమిటీలో ఉండాలన్నది తన ఉద్దేశని పేర్కొన్నాడు. ఐతే ఫరూక్ వ్యాఖ్యలపై అనుష్క వెంటనే స్పందించింది. ‘‘ప్రపంచకప్‌ మ్యాచ్‌ సందర్భంగా సెలక్టర్లు నాకు టీ అందించారనడం చెడు ఉద్దేశంతో చెప్పిన అబద్ధం. టోర్నీలో నేను ఒక్క మ్యాచే చూశాను. అదీ ఫ్యామిలీ బాక్స్‌లో ఉండి చూశాను తప్ప సెలెక్టర్ల బాక్స్‌లో కూర్చొని కాదు. మీరు సెలెక్షన్‌ కమిటీ పైనా, వారి అర్హతలపైనా ఏవైనా విమర్శలు చేయాలనుకుంటే చేసుకోండి. అది మీ ఇష్టం. మీ అభిప్రాయాల్ని సంచలనాత్మకంగా మార్చడానికి నా పేరును లాగొద్దు’’ అని అనుష్క తేల్చి చెప్పింది.

Tags:    

Similar News