అమెరికాకు వెళ్లే మ‌న పిల్ల‌ల‌కు ఆ భ‌యాలు

Update: 2017-07-16 09:17 GMT
ఉన్న‌త విద్య కోసం అమెరికా క‌ల‌ల్ని  క‌నే విద్యార్థులు కోట్ల‌ల్లోనే ఉంటారు. కానీ.. ఆ క‌ల‌లు సాకారం చేసుకొని యూఎస్ వెళ్లే వారు కేవ‌లం వేల‌ల్లో మాత్ర‌మే ఉంటారు. అయితే.. చ‌దువుకోసం అమెరికాకు వెళ్లే భార‌త విద్యార్థుల్లో ఈ మ‌ధ్య‌న భ‌యాందోళ‌న‌లు ఎక్కువైన‌ట్లుగా తాజా స‌ర్వే ఒకటి స్ప‌ష్టం చేస్తోంది.

అమెరికాకు వెళుతున్న భార‌త విద్యార్థులు.. అమెరికాలోని భ‌ద్ర‌త గురించి ఎక్కువ‌గా ఆలోచిస్తున్న‌ట్లుగా తాజాగా జ‌రిపిన ఒక స‌ర్వే నివేదిక స్ప‌ష్టం చేస్తోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ షార్ట్ క‌ట్ లో చెప్పాలంటే ఐఐఈ ఒక స‌ర్వే నిర్వ‌హించింది. దీని ప్ర‌కారం.. అమెరికాలో భ‌ద్ర‌త‌పై భార‌త విద్యార్థుల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంద‌ని.. ఈ నేప‌థ్యంలో అమెరికాలో చ‌దువు కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

ప్ర‌తి ఏటాతో పోలిస్తే.. ఈఏడాది అమెరికాకు చ‌దువు కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య 20 శాతం త‌గ్గే వీలుంద‌ని తెలుస్తోంది. విద్యాసంస్థ‌ల్లో ఆడ్మిష‌న్ మొద‌లుకొని.. అది ఓకే అయ్యే వ‌ర‌కూ త‌మ‌ను సంప్ర‌దించే విద్యార్థుల్లో అత్య‌ధికులు.. ఎక్కువ‌గా భ‌ద్ర‌త మీద‌నే త‌మ దృష్టిని పెడుతున్న‌ట్లుగా చెప్పారు. అమెరిక‌న్లు త‌మ రాక‌ను స్వాగ‌తించ‌ర‌న్న భ‌యాందోళ‌న‌లు కూడా ఈ మ‌ధ్య‌న ఎక్కువైన‌ట్లుగా స‌ర్వే పేర్కొంది.

ఇన్ని భ‌యాందోళ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ అమెరికాలో చ‌దివే విదేశీ విద్యార్థుల్లో చైనాది మొద‌టి స్థాన‌మైతే.. రెండో స్థానం భార‌త్ దేగా చెబుతున్నారు. 2016లో భార‌త్ నుంచి 1,65,000 మంది విద్యార్థులు వివిధ అమెరికా వ‌ర్సిటీల్లో చ‌దువుతున్న‌ట్లుగా స‌ద‌రు స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

ఇక‌.. అమెరికాలో పెరిగిన ముస్లిం వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ప‌శ్చిమాసియా దేశాల నుంచి విద్యార్థుల సంఖ్య గ‌తంలో మాదిరి ఉండే అవ‌కాశం లేద‌ని.. 31 వ‌ర్సిటీలు భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. వ‌ర్సిటీలో ఆడ్మిష‌న్ కోసం అప్లై చేసుకునే ద‌ర‌ఖాస్తుల సంఖ్య గ‌త ఏడాదితో పోలిస్తే త‌గ్గ‌న‌ప్ప‌టికీ.. చివ‌ర‌కు ఆడ్మిష‌న్ తీసుకునే విష‌యంలో మాత్రం త‌గ్గే అవ‌కాశం బ‌లంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. తాజా స‌ర్వేను 112 విద్యాసంస్థ‌లు పాల్గొని త‌మ గ‌ణాంకాల్ని షేర్ చేసుకోవ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News