అక్కడ మనమ్మాయిని బట్టలిప్పదీయాలన్నారు

Update: 2017-04-02 05:19 GMT
జాతివివక్ష ఇటీవల కాలంలో అంతకంతకూ పెరిగిపోతోంది. భద్రతా కారణాల బూచిని చూపిస్తూ.. అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్యన అభ్యంతరకరంగా సాగుతోంది.తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తెర మీదకు వచ్చింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్డ్ విమానాశ్రయంలోని భారత ప్రయాణికురాలికి తీవ్ర అవమానం ఎదురైంది. జాతివివక్షతో వ్యవహరిస్తూ.. అక్కడి అధికారులు మనమ్మాయిని తనిఖీల పేరిట దుస్తులు తొలగించాలని కోరటం గమనార్హం. తనకు ఎదురైన తీవ్ర అవమానాన్ని ఆమె ఫేస్ బుక్ లో వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ అధికారులు తనతో జాతివివక్షను ప్రదర్శించారని ఆమె పేర్కొంటూ.. అందుకు తగ్గ కారణాల్ని వెల్లడించటం గమనార్హం.

బెంగళూరుకు చెందిన శృతి బసప్ప మార్చి 29న తన భర్త అయిన ఐస్ లాండ్ దేశీయుడితో ఫ్రాంక్ ఫర్డ్ విమానాశ్రయానికి వచ్చారు. బాడీ స్కానింగ్ పూర్తి అయిన తర్వాత ఆమెపై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. రెండు వారాల క్రితమే తనకు శస్త్రచికిత్స జరిగిందని చెబుతూ.. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ ను చూపించారు. అయితే.. అందుకు సంతృప్తి చెందని అధికారులు.. ఆమె దుస్తులు విప్పదీయాలన్నారు.

అందుకు శ్వేతా బసప్ప ఒప్పుకోకపోవటంతో.. ఆమెను బలవంతంగా చేశారు. దీంతో.. ఆమె తన భర్త అయిన ఐస్ ల్యాండ్ దేశీయుడ్ని పిలిచారు. అధికారులు దుస్తులు విప్పదీయాలని అడుగుతున్న విషయాన్ని ఆమె చెప్పారు. ఈ విషయం గురించి ఆమె భర్త జోక్యం చేసుకోవటంతో పరిస్థితిలో మార్పు రావటమే కాదు.. దుస్తులు విప్పదీయాలన్న అవసరం లేదంటూ ఆమెను పంపించి వేయటం గమనార్హం. తన భర్త శ్వేతజాతీయుడన్న విషయం తెలిసిన వెంటనే.. అధికారుల తీరులో మార్పు రావటాన్ని శ్వేతబసప్ప ప్రస్తావించారు.

ఒకవేళ తన భర్త కానీ తనతో రాకపోయి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదన్నఆందోళనను ఆమె వ్యక్తం చేశారు. తనకు ఎదురైన అవమానం గురించి ఫేస్ బుక్ లో వెల్లడించిన ఆమె వ్యాఖ్యలపై ఫ్రాంక్ ఫర్డ్ విమానాశ్రయ వర్గాలు రియాక్ట్ అయ్యాయి. ఇలాంటి విధానాలు తనిఖీలకు నిర్దేశించిన ప్రమాణాల్లో లేవని స్పష్టం చేయటంతో పాటు.. జరిగిన ఘటనపై విచారణ జరుపుతామని పేర్కొంది. కొసమెరుపేమంటే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే రియాక్ట్ అయిన ఎయిర్ పోర్ట్ వర్గాలు..అంతకు ముందు తమకు ఎదురైన అవమానం గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News