ఆసీస్‌ లో రెండు చోట్లా మ‌నోళ్లు ఇర‌గ‌దీశారు!

Update: 2016-01-29 10:33 GMT
రెండు కీల‌క విజ‌యాలు భార‌త్ సొంత‌మ‌య్యాయి. ఒకేరోజు ఒకే దేశంలో జ‌రిగిన రెండు వేర్వేరు పోటీల్లో మ‌నోళ్లే విజ‌యం సాధించ‌టం విశేషం. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ రెండు విజ‌యాలు భార‌త మ‌హిళ‌లే సొంతం చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. ఇందులో ఏ విజ‌యాన్ని త‌క్కువ చేసి చెప్ప‌లేని పరిస్థితి. ఒక‌టి ఉమెన్ ఇన్ బ్లూ ఇండియా క్రికెట్ జ‌ట్టు ఆసిస్ తో జ‌రిగిన టీ20 క్రికెట్ సిరీస్ ను సొంతం చేసుకుంటే.. ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మ‌హిళా డ‌బుల్స్ లో మ‌న సాన్ టినా జంట ట్రోఫీని సొంతం చేసుకుంది.

ఒకేరోజున‌.. ఒకే దేశంలో.. ఒకే దేశానికి చెందిన రెండు వేర్వేరు క్రీడ‌ల్లో ట్రోఫీలు సొంతం చేసుకోవ‌టం చాలా అరుదుగా చోటు చేసుకునే ప‌రిణామం. ఇక‌.. విడివిడిగా వారి విజ‌యాల్ని చూస్తే..సాన్‌ టీనా జోరు గ‌త ఏడాదిగా ప్ర‌పంచ టెన్నిస్ లో మ‌హిళా డ‌బుల్స్ లో ఎదురులేని జంట‌గా మారిన సానియా మీర్జా.. స్విస్ అమ్మాయి మార్టినా హింగిస్ క‌లిసి ఇప్ప‌టికి ఏడు టైటిళ్లు సొంతం చేసుకోగా.. భార‌త‌కాల‌మానం ప్రకారం శుక్ర‌వారం జ‌రిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్‌ మ‌హిళ‌ల‌ డబుల్స్ ట్రోఫీని సొంతం చేసుకొని వ‌రుస‌గా ఎనిమిదో ట్రోఫిని చేజిక్కించుకున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ఏడాది ఈ జంటకు ఇది మూడో విజ‌యం. ఇక‌.. గ‌త ఏడాది నుంచి వ‌రుస‌గా 36 మ్యాచ్ ల‌లో ఏ ఒక్కటి ఓడిపోకుండా దూసుకెళ్ల‌టం ద్వారా గ‌డిచిన 26 ఏళ్ల‌లో అత్య‌ధిక వ‌రుస విజ‌యాలు సాధించిన జంట‌గా వీరు నిలిచారు.  మ‌రో ఐదు వరుస విజ‌యాలు కానీ సొంతం చేసుకుంటే ప్ర‌పంచ రికార్డును సృష్టించ‌నున్నారు.

ఆసిస్‌ కు ఉమెన్ ఇన్ బ్లూ చుక్క‌లు ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న‌ టీ20 సిరీస్ ను భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు సొంతం చేసుకుంది. మెల్ బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌ లో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో భార‌త మహిళా జ‌ట్టు సిరీస్ సొంతం చేసుకోవ‌టం విశేషం. ఆసీస్ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించింది టీ20 సిరీస్‌ ను భార‌త మ‌హిళా జ‌ట్టు సొంతం చేసుకోవ‌టం ఇదే తొలిసారి.
Tags:    

Similar News