30 ఏళ్ల‌లో దేశం నుంచి వెళ్లిన బ్లాక్ మ‌నీ 34ల‌క్ష‌ల కోట్లు!

Update: 2019-06-25 05:22 GMT
తెల్లోడు మ‌న‌ల్ని దోచుకున్న దానిపై గుండెలు బాదేసుకుంటాం. మ‌రి.. మ‌నోళ్లు మ‌న‌ల్ని దోచేసి విదేశాల‌కు పంపేసిన న‌ల్ల‌ధ‌నం లెక్క‌ల‌కు సంబంధించిన షాకింగ్ నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. గ‌డిచిన 30 ఏళ్ల‌లో (1980-2010మ‌ధ్య కాలంలో) భార‌తీయులు విదేశాల్లో దాచిన న‌ల్ల‌ధ‌నం లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. త‌క్కువ‌గా అనుకుంటే విదేశాల‌కు వెళ్లిన బ్లాక్ మ‌నీ రూ.15ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌ని.. ఎక్కువ‌గా అనుకుంటే రూ.34 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ పాల‌సీ అండ్ ఫైనాన్స్.. నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎక‌నామిక్ రీస‌ర్చ్.. నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్.. నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎక‌నామిక్ రీసెర్చ్.. నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ నిర్వ‌హించిన మూడు వేర్వేరు అధ్య‌నాల‌కు సంబంధించి అంశాల‌తో పాటు.. ఆర్థిక వ్య‌వ‌హారాల స్థాయి సంఘం వివ‌రాల‌తో తాజా నివేదిక‌ను సిద్ధం చేశారు. 

అయితే ఇప్పుడు వెల్ల‌డించిన అంచ‌నాల‌న్ని కూడా ఊహ‌ల ఆధారంగా చేప‌ట్టిన‌వే త‌ప్పించి.. శాస్త్రీయ‌మైన విశ్లేష‌ణ లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. అంచ‌నాల‌న్నీ ప‌లు స‌ర్దుబాట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చేప‌ట్టిన‌వే త‌ప్పించి మ‌రింకేమీ లేవు. పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం పేర్కొన్న అంచ‌నాల ప్ర‌కారం విదేశాల్లో మూలుగుతున్న న‌ల్ల‌ధ‌నం గ‌రిష్ఠంగా రూ.34వేల కోట్లుగా ప్ర‌స్తావించింది. ఈ మొత్తంతో తెలంగాణ‌లో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులాంటివి 19.. పోల‌వ‌రం ప్రాజెక్టు లాంటివి 30 వ‌ర‌కూ నిర్మించే వీలుంది. అంతేకాదు.. దేశం వెలుప‌ల ఉన్న న‌ల్ల‌ధ‌నం భార‌త వార్షిక బ‌డ్జెట్ తో స‌మానంగా చెబుతున్నారు.

ఇక న‌ల్ల‌ధనానికి సంబంధించి ఎక్కువ‌గా ఉండే వ్యాపారాల విష‌యంలో రియ‌ల్ ఎస్టేట్‌.. గ‌నులు.. ఔష‌ధాలు.. పాన్ మ‌సాలా.. గుట్కా.. పొగాకు.. బంగారం.. క‌మోడిటీస్..సినిమాలు.. విద్య రంగాలు ఉన్న‌ట్లుగా ప‌లు అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేశాయి. మ‌రి.. వీటి నియంత్ర‌ణ ఏమిట‌న్న దానిపై ఇతిమిద్దంగా ఏమీ లేద‌ని ప‌రిస్థితి. మ‌రింత భారీ మొత్తం న‌ల్ల‌ధ‌నంగా బ‌య‌ట‌దేశాల్లో ఉన్న నేప‌థ్యంలో.. ఈ బ్లాక్ మ‌నీని జన‌రేట్ కాకుండా మోడీ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి. అదే స‌మ‌యంలో విదేశాల్లో మూలుగుతున్న‌న‌ల్ల‌ధ‌నంలో అంతో ఇంతో అయినా దేశానికి తిరిగి తెచ్చే అవ‌కాశం ఉందా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. 


Tags:    

Similar News